
పాములను చూస్తే చాలామందికి భయం కలుగుతుంది. ఇక పాము విడిచిపెట్టిన కుబుసాన్ని చూస్తే.. ఇక్కడ పాము తిరుగుతూ ఉంటుందని, కుబుసాన్ని చూస్తే పాము పగబడుతుంది వంటి ఎన్నో నమ్మకాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా పాము కుబుసాన్ని విడిచిపెడుతున్న సమయంలో దాన్ని చూస్తే ప్రమాదకరమని, పాము పగబట్టి మనపై దాడి చేస్తుందనే మాటలు కూడా వినిపిస్తుంటాయి. అయితే ఇందులో నిజమెంత? పాములు అసలు కుబుసాన్ని(చర్మాన్ని) ఎందుకు విడిచిపెడతాయి? ఇందులో నిజం ఏంటి? అపోహ ఏంటి? తెలుసుకుందాం..
పాములు కుబుసం విడిచిపెట్టే ప్రక్రియను ఎక్డిసిస్ (Ecdysis) అంటారు. రోజులు గడిచేకొద్దీ పాము శరీరం పెరుగుతున్నప్పటికీ దాని బయటి చర్మపు పొర అదే విధంగా పెరగదు. దీంతో పాత చర్మం దాని శరీరానికి బిగుతుగా మారుతుంది. కొత్త చర్మం పాత చర్మం కింద అభివృద్ధి చెందిన తర్వాత.. పాము తన బయటి పాత పొరను తొలగిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరం పెరుగుదలకు అవసరమైన చోటు లభించడంతో పాటు, తన పాత లేదా దెబ్బతిన్న చర్మాన్ని తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
మనుషుల్లో చర్మం చిన్న చిన్న కణాల రూపంలో నిరంతరం తొలగిపోతుంది. కానీ పాముల బయటి కెరాటిన్ పొర ఒక నిరంతర పొరలా ఉండటంతో.. అది సాధారణంగా ఒకే ముక్కగా విడిపోతుంది. చర్మం విడిచే ముందు పాము శరీర రంగు కొద్దిగా మసకబారవచ్చు. కళ్లపై ఉన్న పొర కూడా మసకగా కనిపిస్తుంది. అనంతరం పాము తలను రాయి, చెట్టు కొమ్మ లేదా ఇతర గరుకైన ఉపరితలానికి రుద్ది పాత చర్మాన్ని చీల్చుతుంది. ఆ తర్వాత శరీరాన్ని కదిలిస్తూ పాత చర్మం నుంచి బయటకు వస్తుంది.
అన్ని పాములు ఒకే సంఖ్యలో చర్మాన్ని విడిచిపెట్టవు. పాము వయసు, జాతి, పెరుగుదల, ఆరోగ్యం, ఆహారం, వాతావరణం వంటి అంశాలపై ఈ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. చిన్న వయసులో వేగంగా పెరిగే పాములు పెద్ద పాముల కంటే ఎక్కువసార్లు చర్మాన్ని విడిచిపెట్టవచ్చు. కొన్ని పాములు సంవత్సరంలో అనేకసార్లు ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి.
చర్మం విడిచే సమయంలో పాములు కొంత అసౌకర్యంగా, అప్రమత్తంగా ఉంటాయి. ముఖ్యంగా కళ్లపై ఉండే పారదర్శక పొర మసకబారడం వల్ల వాటి చూపు పాములను తాత్కాలికంగా అసౌకర్యానికి గురిచేస్తుంది. అందువల్ల ఆ సమయంలో పామును దగ్గరగా వెళ్లి తాకడం, తరిమేయడం లేదా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. తన ప్రాణాలకు ప్రమాదమని భావిస్తే పాము తనను తాను రక్షించుకునేందుకు దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఆత్మరక్షణ కోసమే తప్ప.. ‘పగ’ కారణంగా జరిగే దాడి కాదు.
ఇది చాలాకాలంగా ప్రచారంలో ఉన్న ఒక అపోహ. పాము తన విడిచిపెట్టిన పాత చర్మాన్ని గుర్తుపెట్టుకుని.. దాన్ని చూసిన మనిషిని వెంబడించి ప్రతీకారం తీర్చుకుంటుందనే నమ్మకానికి శాస్త్రీయ ఆధారం లేదు. పాములు మనుషులపై ‘పగ’ పెంచుకుని తర్వాత దాడి చేస్తాయడం కరెక్ట్ కాదు. వాటి ప్రవర్తనను సహజ రక్షణ చర్యలుగానే అర్థం చేసుకోవాలి. అయితే పాము చర్మం కనిపించిన ప్రదేశంలో దాన్ని విడిచిపెట్టిన పాము సంచరిస్తూ ఉండే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది.
పాము విడిచిన చర్మం విషపూరితం కాదు. అది జీవం లేని బయటి చర్మపు పొర మాత్రమే. దాన్ని చేతులతో తాకడం వల్ల విషం ఎక్కుతుందనే నమ్మకం కూడా అపోహ మాత్రమే. విషపూరితమైన పాము కాటు వేసినప్పుడు మాత్రమే దాని విషం ప్రమాదకరంగా ఉంటుంది.
పాము విడిచిన చర్మం కనిపిస్తే దాన్ని పట్టుకోవడానికి లేదా దగ్గరగా వెళ్లి పరిశీలించడానికి ప్రయత్నించకపోవడం మంచిది. ఆ ప్రాంతం పాముకు అనుకూలమైన నివాస ప్రాంతంగా ఉండే అవకాశముంది.
పాము చర్మం విడిచిపెట్టడం ఒక సహజ జీవ ప్రక్రియ మాత్రమే. దానికి పగ, ప్రతీకారం వంటి భావనలను ఆపాదించడం శాస్త్రీయంగా సరైనది కాదు.