
టిప్పు సుల్తాన్.. మైసూరు సింహంగా చరిత్రలో నిలిచిపోయారు. హైదర్ అలీ కుమారుడిగా మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆయన.. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని తీవ్రంగా ఎదిరించారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన వీరయోధుడుగా నిలిచారు. నాలుగు ఆంగ్లో-మైసూరు యుద్ధాలలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యుద్ధాల్లో ఇనుప కవచాలతో కూడిన ‘మైసూరు రాకెట్లను’ ప్రయోగించి.. ఆధునిక రాకెట్ సాంకేతికతకు ఆద్యుడిగా నిలిచారు.
అలానే వ్యవసాయం, పట్టు పరిశ్రమ, నాణేల ముద్రణలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. “గొర్రెలా వందేళ్లు బతికేకంటే, సింహంలా ఒక్కరోజు బతకడం మిన్న” అని నినదించిన ఆయన.. 1799 మే 4న శ్రీరంగపట్నం కోటలో బ్రిటిష్ సైన్యంతో పోరాడుతూ మరణించారు. అయితే ఆయన మరణానంతరం కోటలోని అపార సంపద, ఆయుధాలు, అరుదైన రాజరిక వస్తువులను ఆంగ్లేయులు కొల్లగొట్టారు. వాటిలో చాలా వరకు విదేశాలకు తరలిపోయి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన వేలాల్లో చేతులు మారాయి. ఆ సంపద ప్రస్తుతం ఎక్కడ ఉందో మీకోసం ప్రత్యేకంగా..
టిప్పు సుల్తాన్ సంపదలో అత్యంత విలువైనది ఆయన కత్తి. లండన్‌కు చెందిన ప్రముఖ వేలం సంస్థ ‘బోన్హామ్స్’ 2023 మే 23న నిర్వహించిన వేలంలో ఈ కత్తి ఏకంగా 14 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ.145 కోట్లు) అమ్ముడైంది. అంచనా వేసిన 2 మిలియన్ పౌండ్ల కంటే ఏడు రెట్లు ఎక్కువ ధర పలికి.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన భారతీయ చారిత్రక వస్తువుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. టిప్పు నిద్రపోయేటప్పుడు కూడా ఈ కత్తిని తన పక్కనే ఉంచుకునేవారని చరిత్ర చెబుతోంది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచారు.
కాగా ఈ కత్తి ప్రయాణంలో వ్యాపారవేత్త విజయ్ మాల్యా పేరు కూడా వినిపిస్తుంది. 2003లో లండన్‌లో జరిగిన ప్రైవేట్ వేలంలో మాల్యా టిప్పు కత్తిని కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకువచ్చారు. అయితే, ఆ కత్తి వల్ల తమ కుటుంబానికి అపశకునం కలుగుతోందన్న నమ్మకంతో 2016లో దాన్ని వదిలించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, 2023లో వేలానికి వచ్చిన కత్తి మాల్యా దగ్గర ఉన్నదేనా కాదా అనేదానిపై స్పష్టత లేదు.
టిప్పు సుల్తాన్ కూర్చునే అష్టభుజి ఆకారపు బంగారు పూత సింహాసనం (తఖత్) నేటికీ పూర్తి రూపంలో దొరకలేదు. చరిత్రకారుడు కిర్మానీ కథనం ప్రకారం, 1787లో నిర్మించిన ఈ సింహాసనం చుట్టూ ఎనిమిది బంగారు పులి తలలు అమర్చి ఉండేవి. 1799 యుద్ధం తర్వాత బ్రిటిష్ సైన్యంలోని ప్రైజ్ ఏజెంట్లు ఈ సింహాసనాన్ని ముక్కలుగా విడదీసి పంచుకున్నారు. ఆ శకలాలు ప్రస్తుతం వివిధ చోట్ల ఉన్నాయి:
రాయల్ కలెక్షన్ (బ్రిటన్ రాజకుటుంబం): సింహాసనం అడుగుభాగంలో ఉండే పెద్ద బంగారు పులి తల, పందిరి పైభాగంలో ఉండే వజ్రాల ‘హుమా పక్షి’ని అప్పటి బ్రిటన్ రాజు జార్జ్-3, రాణి షార్లెట్లకు బహుమతిగా ఇచ్చారు.
పోవిస్ కోట (వేల్స్): వేల్స్‌లోని నేషనల్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్న పోవిస్ కోటలో సింహాసనానికి చెందిన ఒక బంగారు పులి తల భద్రపరిచి ఉంది. దీనిపై కెంపులు, వజ్రాలు, పచ్చలు పొదిగి ఉంటాయి.
ప్రైవేట్ సేకరణలు: సుమారు 1.5 మిలియన్ పౌండ్ల విలువైన మరో పులి తల దేశం దాటి వెళ్లకుండా 2021 నవంబర్‌లో యూకే ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే సింహాసనానికి చెందిన ఒక చెక్క పులి గోరు 2016లో వేలంలో అమ్ముడై ఓ వ్యక్తిగత సేకరణకు చేరింది.
లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ (V&A) మ్యూజియంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకునే అద్భుత కళాఖండం ‘టిప్పుస్ టైగర్’. 1790వ దశకంలో టిప్పు దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. యూరోపియన్ సైనికుడిపై దాడి చేస్తున్నట్లుగా ఉన్న నిజ పరిమాణపు చెక్క పులి బొమ్మ ఇది. దీని లోపల ఒక సంగీత పరికరం (ఆర్గాన్) అమర్చి ఉంటుంది. హ్యాండిల్ తిప్పినప్పుడు పులి గాండ్రిస్తున్నట్లు, సైనికుడు ఆర్తనాదాలు చేస్తున్నట్లు శబ్దాలు వస్తాయి. శ్రీరంగపట్నం రాజభవనంలోని సంగీత గదిలో ఉన్న దీన్ని, 1799 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్‌కు తరలించింది. ప్రస్తుతం ఇది చాలా సున్నితంగా మారడంతో శబ్దాలు రాకుండా కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉంచారు.
టిప్పు సుల్తాన్ తన పాలనలో అత్యంత కళాత్మకమైన బంగారు, వెండి, రాగి నాణేలను ముద్రించారు. వీటిపై గ్రహాలు, నక్షత్రాల పేర్లతో (బహ్రామ్, ముష్తారి, జోహ్రా) ముద్రణలు ఉండేవి. లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియం, కేంబ్రిడ్జ్‌లోని ఫిట్జ్‌విలియం మ్యూజియంలలో పాట్నా, బెంగళూరు, కాలికట్ టంకశాలల్లో ముద్రించిన అరుదైన నాణేలు భద్రంగా ఉన్నాయి. భారతదేశంలో మైసూరు, బెంగళూరు, చెన్నై ప్రభుత్వ మ్యూజియంలలో టిప్పు నాణేలను చూడవచ్చు.
కేవలం కత్తి, సింహాసనమే కాకుండా టిప్పుకు సంబంధించిన మరిన్ని విలువైన వస్తువులు విదేశీ మ్యూజియంలలో ఉన్నాయి.
రత్నాల ఉంగరం: 1799 యుద్ధంలో టిప్పు మరణించిన తర్వాత ఆయన చేతివేలి నుంచి తీసిన బంగారు ఉంగరంపై దేవనాగరి లిపిలో ‘రామ్’ అని చెక్కి ఉంది. ఇది 2014లో లండన్‌లో వేలానికి వచ్చింది.
అత్యాధునిక తుపాకులు: టిప్పు ఆయుధాగారంలో పులి చారల డిజైన్‌తో తయారు చేసిన ఫ్లింట్లాక్ తుపాకులు, ఫిరంగులు ఉండేవి. వీటిలో కొన్ని లండన్‌లోని విండ్సర్ కోటలో, మరికొన్ని న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఉన్నాయి.
రాజరిక వస్త్రాలు, గ్రంథాలు: టిప్పు ధరించే పట్టు వస్త్రాలు, యుద్ధ కవచం (వార్ జాకెట్) కొన్ని విదేశీ మ్యూజియంలలో ఉండగా, ఆయన సేకరించిన వేలాది అరుదైన పుస్తకాలు, ఖురాన్ ప్రతులు కోల్‌కతాలోని ఆసియాటిక్ సొసైటీ, లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో భద్రపరిచారు.