రెండో అతిపెద్ద జీవి.. రోజుకు రెండు టన్నుల చేపలు, రొయ్యలు తింటుంది..

వేల్స్‌ తీరంలో ఫిన్‌ వేల్‌ అద్భుత విన్యాసాలు డ్రోన్ కెమెరాకు చిక్కి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నీలి తిమింగలం తర్వాత రెండో అతిపెద్ద జీవి అయిన ఫిన్‌ వేల్‌ విన్యాసాలు సముద్ర జీవుల పట్ల ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ అరుదైన దృశ్యాలు అంతరించిపోతున్న తిమింగలాల రక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి.

రెండో అతిపెద్ద జీవి.. రోజుకు రెండు టన్నుల చేపలు, రొయ్యలు తింటుంది..
Fin Whale

Updated on: Oct 21, 2026 | 3:54 PM

సముద్ర గర్భంలో దాగి ఉండే రహస్యాలు, భారీ జీవుల విన్యాసాలు ఎప్పుడూ మానవులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి అపురూప ఘటనే ఇటీవల బ్రిటన్‌లోని వేల్స్‌ తీరంలో చోటుచేసుకుంది. భూమిపై నీలి తిమింగలం తర్వాత రెండో అతిపెద్ద జీవిగా పేరుగాంచిన ఓ భారీ ఫిన్‌ వేల్‌ సముద్రంపైకి ఎగిసి దుముకుతున్న అద్భుత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ బరువైన జంతువు సముద్రపు అలలను చీల్చుకుంటూ ఆకాశానికి ఎగిరి మళ్లీ నీటిలోకి డైవ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఈ అద్భుత దృశ్యాలను బ్రిటన్‌లోని వేల్స్‌కు చెందిన రైస్ మోర్గాన్ అనే ఆయిల్ రిఫైనరీ ఉద్యోగి తన డ్రోన్ కెమెరాతో బంధించారు. తన స్నేహితులతో కలిసి పెంబ్రోక్షైర్ తీరంలో ఫార్చ్యూనా అనే తన ప్రైవేట్ బోటులో వెళ్తూ ఉండగా ఈ అద్భుతం జరిగింది. దూరంగా సముద్రంలో తిమింగిలం నీటిని పైకి చిమ్మటాన్ని గమనించిన మోర్గాన్ బృందం, వెంటనే చేపల వేటను ఆపేసి, తిమింగలానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దూరం నుంచి డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఈ వీడియోను మోర్గాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, వందల్లో లైక్స్ వస్తాయనుకున్న వీడియోకు ఏకంగా లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చిపడ్డాయి. ఈ విజువల్స్ కేవలం కనువిందు చేయడమే కాకుండా అంతరించిపోతున్న తిమింగలాల రక్షణపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరలేపాయి.

ఫిన్‌ వేల్‌ ప్రత్యేకతలు:

ఫిన్‌ వేల్‌ అనేది భూమిపై రెండో అతిపెద్ద జీవి. ఇది 77 అడుగులకు పైగా పొడవు ఉంటుంది. దీని జీవితకాలం సుమారు 90 ఏళ్లు. ఈ భారీ జీవి రోజుకు రెండు టన్నుల చిన్న చేపలు, రొయ్యలు వంటివాటిని ఆహారంగా తీసుకుంటుంది. తోక దగ్గర వంపు తిరిగిన రెక్క, పైన ముదురు బూడిద రంగు, కింద తెల్లటి పొట్ట, దవడ ఎడమ వైపు నలుపు, కుడి వైపు తెలుపు రంగుతో ఇది ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఫిన్‌ వేల్స్ వేసవిలో ధ్రువ ప్రాంతాలకు, శీతాకాలంలో వెచ్చని ఉష్ణమండల సముద్రాలకు వలస వెళ్తుంటాయి.

అంతరించిపోతున్న జాతులు – సవాళ్లు:

20వ శతాబ్దంలో జరిగిన వాణిజ్య వేట వల్ల లక్షల సంఖ్యలో ఫిన్‌ వేల్స్ అంతరించిపోయాయి. ప్రస్తుతం వీటిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చి రక్షిస్తున్నప్పటికీ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. భారీ నౌకలు ఢీకొట్టడం, చేపల వలల్లో చిక్కుకోవడం, వాతావరణ మార్పులు వంటివి వీటి పాలిట శాపంగా మారుతున్నాయి. మరోవైపు మోర్గాన్ తీసిన ఈ వీడియో తిమింగలాల వేటపై అంతర్జాతీయంగా అవగాహన పెంచేందుకు దోహదపడుతోంది. దురదృష్టవశాత్తు నార్వే, జపాన్ లతో పాటు ఐస్‌లాండ్ మాత్రమే ఇప్పటికీ వాణిజ్యపరంగా తిమింగలాల వేటను కొనసాగిస్తున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జూన్ 22న ఐస్‌లాండ్ మళ్లీ ఫిన్‌ వేల్స్ వేటను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో మోర్గాన్ కెమెరాకు చిక్కిన ఈ అద్భుత దృశ్యాలు సముద్ర జీవుల అందాన్నే కాదు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ప్రపంచానికి గుర్తు చేస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే మళ్లీ సముద్రంలోకి వెళ్లి ఇలాంటి మరెన్నో అద్భుత దృశ్యాలను బంధిస్తానని రైస్ మోర్గాన్ చెబుతున్నారు. ఈ సంఘటన సముద్ర జీవుల సంరక్షణ ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us