2,300 ఉద్యోగాలకు అప్లై చేసినా నో జాబ్.. నోబెల్ కమిటీ గుర్తింపు పొందిన PhD గ్రాడ్యుయేట్‌కి ఉద్యోగం దొరకలే!
చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినా, ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసినా ఉద్యోగం దొరుకుతుందనే గ్యారంటీ లేదని అమెరికాకు చెందిన ఓ యువకుడి పరిస్థితి చెబుతోంది. ఏకంగా 2,300కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్థిరమైన ఉద్యోగం సాధించలేకపోయాడు. అతడి పరిశోధనను 2024లో నోబెల్ కమిటీ శాస్త్రీయ పరిశోధనలో మెషిన్ లెర్నింగ్ వినియోగానికి ఉదాహరణగా ప్రస్తావించింది. అయినా ఉద్యోగ వేటలో అతడికి నిరాశే ఎదురైంది..

అమెరికాలోని ఉటా రాష్ట్రం సాల్ట్ లేక్ సిటీకి చెందిన 30 ఏళ్ల జాక్ వైస్ (Jack Weiss) పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయనకు ఉద్యోగం దొరకకపోవడంతో చివరకు తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటూ కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ వివరాలను ది వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. జాక్ వైస్ రైస్ యూనివర్సిటీలో తన అండర్‌గ్రాడ్యుయేట్ విద్యను అత్యుత్తమ ప్రతిభతో పూర్తి చేశాడు. ఆ తర్వాత 2018లో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరాడు. అణువుల మధ్య పరస్పర చర్యలు, రసాయన శాస్త్ర సూత్రాలపై పరిశోధనలు చేశాడు. ముఖ్యంగా మంచు ఏర్పడే ప్రక్రియపై ఆయన చేసిన పరిశోధనకు గుర్తింపు లభించింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల నుంచి ఫుడ్ ప్రిపరేషన్ జాబ్ వరకు!
2024లో నోబెల్ కమిటీ శాస్త్రీయ పరిశోధనలో మెషిన్ లెర్నింగ్ అనువర్తనాలను వివరించే సందర్భంలో ఆయన పరిశోధనను ఉదాహరణగా ప్రస్తావించింది. ఇంతటి అకడమిక్ నేపథ్యం ఉన్నప్పటికీ, పీహెచ్‌డీ పూర్తయ్యాక ఆయనకు తగిన ఉద్యోగం లభించలేదు. మొదట ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పరిశోధన ఉద్యోగాలు, జాతీయ ప్రయోగశాలల్లో ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే చాలా దరఖాస్తులకు స్పందనే రాలేదు. మరికొన్ని తిరస్కరణకు గురయ్యాయి. తన పరిశోధనా రంగంలో అవకాశాలు లభించకపోవడంతో జాక్ వైస్ ఉద్యోగాల కోసం అన్వేషణను ఇతర రంగాలకు కూడా విస్తరించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సైతం దరఖాస్తు చేసుకున్నాడు. చివరకు ఫ్రోజెన్ క్రాబ్ కేక్స్ విక్రయించే ఓ కంపెనీలో ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన ఉద్యోగానికి కూడా అప్లై చేశాడు.
ప్రిన్స్‌టన్, రైస్ యూనివర్సిటీల పూర్వ విద్యార్థులను సంప్రదించి ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కొందరు కంపెనీల ఉద్యోగ ప్రకటనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అయినప్పటికీ, ఆయనకు ఆశించిన ఫలితం రాలేదు. 2026 జనవరిలో జాక్ వైస్‌కు ఓ ఏఐ స్టార్టప్‌లో పార్ట్‌టైమ్ పని చేసే అవకాశం లభించింది. ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు నిపుణులను నియమించుకుంది. ఈ పనికి ఆయనకు గంటకు 70 డాలర్లు చెల్లించేవారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.6,000కు పైమాటే. అయితే, డాలర్ మారకపు విలువను బట్టి ఈ మొత్తం మారుతుంది. మొదట వారానికి 20 గంటల వరకు పని లభించినప్పటికీ, కొన్ని వారాల్లో కేవలం నాలుగు గంటల పనికే పరిమితమయ్యేది. ఆ తర్వాత పనులు మరింత తగ్గిపోయాయి. కొన్ని వారాల పాటు అసలు పని కూడా దొరకలేదు. చివరకు మార్చి మధ్యలో ఆయన కాంట్రాక్టును రద్దు చేసినట్లు గ్రూప్ చాట్ ద్వారా సమాచారం అందింది. దీంతో మరోసారి ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాల్సి వచ్చింది.
ఇప్పుడు లా స్కూల్ వైపు అడుగులు!
ప్రస్తుతం జాక్ వైస్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాడు. నవంబర్‌లో లా స్కూల్ ప్రవేశ పరీక్ష రాయాలని భావిస్తున్నాడు. మరోవైపు, వ్యాపార రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. వ్యవసాయానికి ఇబ్బందులు కలిగించే ఆక్రమణ కలుపు మొక్కలను తొలగించేందుకు ఉపయోగపడే ఏఐ ఆధారిత డ్రోన్‌ను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు. అంటే ఉద్యోగం దొరకకపోయినా తన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సొంతంగా ఏదైనా సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. జాక్ వైస్ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. ఇంతటి ప్రతిభ, విద్యార్హతలు ఉన్న తమ కుమారుడికి ఉద్యోగం దొరకకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన దరఖాస్తుల్లో ఏమైనా లోపాలున్నాయేమోనని తల్లి హోలీ కార్వర్స్ స్వయంగా పరిశీలించినప్పటికీ, యజమానులు తిరస్కరించడానికి స్పష్టమైన కారణం కనిపించలేదని తెలిపింది. ‘ఇది నిజంగా ఊహించని విషయం. ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు’ అని ఆమె పేర్కొంది. ‘మా అబ్బాయి ఉద్యోగం కోసం ఇంతలా ఇబ్బంది పడతాడని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదుస అని ఆయన తండ్రి జాన్ వైస్ అన్నారు.
అమెరికాలోనూ ఉద్యోగాల కొరత?
ది వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ లిండ్సే ఎల్లిస్ అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేసిన సమయంలో జాక్ వైస్ కథ తన దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. ఉద్యోగ నియామకాలు మందగించిన పరిస్థితుల్లో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఆయన ఉదాహరణగా నిలిచారని వివరించారు. అమెరికా ఉద్యోగ మార్కెట్ ప్రస్తుతం తక్కువ నియామకాలు, తక్కువ ఉద్యోగ విరమణలు ఉన్న పరిస్థితిని ఎదుర్కొంటోందని ఈ కథనం పేర్కొంది. కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడం తగ్గించడంతో పాటు, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా తమ స్థానాలను వదులుకోవడం తక్కువైంది. దీంతో కొత్తగా ఉద్యోగాలు వెతుకుతున్న వారికి అవకాశాలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా అమెరికాలో 27 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉన్నవారి వాటా కూడా కోవిడ్-19 మహమ్మారి కాలాన్ని మినహాయిస్తే, ఈ వేసవిలో దాదాపు పదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరినట్లు కథనం వెల్లడించింది. ఈ ఘటన చెప్పే విషయం ఏమిటంటే.. ఉన్నత విద్యార్హతలు, పరిశోధనలో గుర్తింపు ఉన్నప్పటికీ ఉద్యోగం లభించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సవాలుగా మారవచ్చు. వ్యక్తిగత ప్రతిభతో పాటు ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు, కంపెనీల నియామక విధానాలు కూడా ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతాయి.
