
తూర్పు, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో ప్రతి ఏడాది నమోదయ్యే పాముకాట్లలో ఈ కాపార్‌హెడ్ విషపూరిత పాముల వాటానే అధికం. అమెరికాలో ముఖ్యంగా వేసవికాలంలో వీటి సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల జార్జియాలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఉష్ణోగ్రత ప్రతి డిగ్రీ పెరిగినప్పుడు విషపూరిత పాముకాట్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాపర్‌హెడ్ శాస్త్రీయ నామం అగ్కిస్ట్రోడాన్ కాంటోర్ట్రిక్స్. ఇది పిట్ వైపర్ జాతికి చెందిన విషపూరిత పాము. కళ్లకు, ముక్కు రంధ్రాలకు మధ్య ఉండే ప్రత్యేక వేడి గ్రహించే గుంటల సహాయంతో రాత్రిపూట కూడా వెచ్చని రక్తం కలిగిన జంతువులను గుర్తించగలదు. ఈ పాముకు రాగి రంగు తల ఉండటంతోనే దీనికి కాపర్‌హెడ్ అనే పేరు వచ్చింది. లేత గోధుమ రంగు శరీరంపై ఇసుక గడియారం ఆకారంలో ముదురు గోధుమ రంగు చారలు ఉండటం దీని ప్రత్యేక లక్షణం.
ఈ పాములు అమెరికాలోని తూర్పు, మధ్య ప్రాంతాల్లో విస్తృతంగా కనిపిస్తాయి. అడవులు, కొండలు, పొదలు, పాడుబడిన భవనాలు, చెక్క కుప్పలు, చెత్తకుప్పలు వంటి ప్రదేశాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. శివారు ప్రాంతాల్లో కూడా సులభంగా జీవించగల సామర్థ్యం ఉండటంతో మనుషులకు దగ్గరగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేసవిలో ఇవి ప్రధానంగా రాత్రిపూట చురుకుగా ఉంటాయి. ముఖ్యంగా వర్షం పడిన తర్వాత వచ్చే వెచ్చని, తేమతో కూడిన రాత్రుల్లో ఎక్కువగా బయటకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాపర్‌హెడ్ పాముకాటు చాలా నొప్పిగా ఉన్నప్పటికీ, మరణాలు చాలా అరుదుగా జరుగుతాయి. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 7,000 నుంచి 8,000 విషపూరిత పాముకాట్లు నమోదవుతుండగా, వాటిలో గణనీయమైన సంఖ్య కాపర్‌హెడ్ పాములవే. అయితే పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాటు వేసిన చోట తీవ్రమైన నొప్పి, వాపు, ఎర్రబడటం, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రతి కాపర్‌హెడ్ పాముకాటుకు యాంటీవెనమ్ (విష నిరోధక మందు) అవసరం ఉండదు. చాలామంది రోగులకు నొప్పి, వాపును నియంత్రించే చికిత్సతోనే కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే విష ప్రభావం తీవ్రంగా ఉంటే లేదా రోగి పరిస్థితి విషమిస్తే వైద్యులు యాంటీవెనమ్ ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.