ప్యాకింగ్ ఆకట్టుకుంటోందని కొనేస్తున్నారా? చిన్నారుల పాలిట అవే శాపంగా మారుతున్నాయని తెలుసా

జంక్ ఫుడ్స్‌లో కేలరీలు, చక్కెర, ఉప్పు అధికంగా ఉంటాయి. కానీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు అస్సలు ఉండవు. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్, సోడాలు తాగడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్యాలు తలెత్తుతాయి. ఎక్కువ చక్కెర ఇంకా ఫ్యాట్స్ ఉండటం వల్ల చిన్న వయసులోనే స్థూలకాయం, మధుమేహం (డయాబెటిస్), ఫాటీ లివర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి.

ప్యాకింగ్ ఆకట్టుకుంటోందని కొనేస్తున్నారా? చిన్నారుల పాలిట అవే శాపంగా మారుతున్నాయని తెలుసా
Junk Food Risks For Children.jpg

Updated on: Apr 19, 2026 | 6:10 AM

ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆహారం మెదడు ఎదుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట ఇంకా నిద్రలేమి సమస్యలు చిన్నారులను వేధిస్తాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు, రంగురంగుల ప్రకటనలతో ఈ విషపూరిత ఆహారం మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. దీనివల్ల చిన్నారుల శారీరక ఎదుగుదలే కాకుండా మానసిక వికాసం కూడా దెబ్బతింటోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మారాల్సింది తల్లిదండ్రులే..

చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విషయంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి. ఇంట్లో పెద్దల ఆహార అలవాట్లను చూసే పిల్లలు నేర్చుకుంటారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ఉండే ఆహారం ఆరోగ్యం కాదనే అవగాహన పిల్లలకు కల్పించాలి. వీలైతే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం చేయాలి. తాము స్వయంగా తయారు చేసిన పదార్థాలను వారు ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యకరమైన ఆహారం తిన్నప్పుడు వారిని చిన్న చిన్న ప్రోత్సాహకాలతో అభినందించాలి. టెక్కలి సీడీపీవో విద్యా శతపతి సూచించినట్లుగా.. ప్యాక్ చేసిన పదార్థాల కంటే ఇంట్లో వండిన తాజా ఆహారమే పిల్లల ఎదుగుదలకు అత్యుత్తమం.

సాంప్రదాయ ఆహారంతోనే ఆరోగ్యం..

చిన్నారుల శారీరక, మానసిక వికాసం కోసం ఇంట్లో వండిన సమతుల్య ఆహారాన్ని అందించాలి. పప్పులు, కూరగాయలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, మాంసం వంటి ప్రోటీన్ ఆధారిత పదార్థాలు వారి పెరుగుదలకు ఎంతో అవసరం. వీటితో పాటు అరటి పండు, క్యారెట్, బీట్‌రూట్ వంటివి విటమిన్లు ఇంకా ఖనిజ లవణాలను అందిస్తాయి. మారుమూల గ్రామాల వరకు జంక్ ఫుడ్ ప్రభావం విస్తరిస్తున్న తరుణంలో, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలను ఆ ఆకర్షణకు లోను కాకుండా చూసుకోవాలి.

సంప్రదాయ ఆహారమే చిన్నారులకు అసలైన సంజీవని అని గుర్తించాలి. పిల్లల ఆరోగ్యం విషయంలో తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రుచి కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చేలా వారిని మలచడం తల్లిదండ్రుల బాధ్యత. ‘పోషణ్ పక్వాడ’ వంటి కార్యక్రమాల ఉద్దేశ్యం కూడా ఇదే. ప్రకృతి సిద్ధమైన ఆహారంతో మన చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి బాటలు వేద్దాం.

Follow Us