మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాలుష్యం తారా స్థాయికి చేరుకుంది. అలాంటి సమయాల్లో గాలిలోని అత్యంత ప్రమాదకరమైన చిన్న కణాలు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి. దగ్గు, తలనొప్పి, కంటి చికాకు, అలసట వంటి లక్షణాలు జనాల్లో కనిపిస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే కాలుష్యం కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంభవిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదో ఒక రోజు మనం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోన్నా ఆశ్చర్య పడవసరం లేదు. విషపూరితమైన గాలిని పీల్చడం రోజుకు 12 సిగరెట్లకు సమానం. ఇది మీ ఆయుర్దాయాన్ని తగ్గిస్తుంది. అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలుష్యం మీ ఊపిరితిత్తులను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. రాబోయే రోజుల్లో చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కలుషిత గాలిలో అనేక రకాల హానికరమైన కణాలు ఉంటాయి. అవి చర్మానికి చాలా హాని కలిగిస్తాయని అంటున్నారు నిపుణులు. చర్మం, కళ్ళు, శ్వాస ద్వారా ఇవి శరీరం లోపలికి ప్రవేశించడం ద్వారా మన శరీరానికి ఎక్కువ హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈరోజు ఇప్పిటికిప్పుడు దాని ప్రభావాలు మీకు తెలియకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా అవి మన శరీరంలో చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. అంత సులభంగా వదిలిపోవు.
పొల్యూషన్ వల్ల చర్మం పాడైపోతోందని, అందువల్ల ఎక్కువగా బయట తిరిగేవాళ్లు తమ వయసు కంటే పెద్దవాళ్లలా కనిపిస్తారని వైద్యులు చెబుతున్నారు. అదనంగా చర్మంపై అదనపు పిగ్మెంటేషన్, ముడతలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీంతో చర్మం పొడిబారడంతోపాటు పగుళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.