ఏది నిజం.. ఏది అబద్దం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..

|

Jan 09, 2025 | 1:24 PM

ప్రజల జీవనశైలి, అసమతుల్య ఆహారం, అవగాహన లోపం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటివి గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు.. ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా ఈ తీవ్రమైన వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చు.. గుండె జబ్బులకు సంబంధించి కొన్ని పుకార్లను అస్సలు నమ్మకూడదంటున్నారు వైద్య నిపుణులు.. అవేంటో తెలుసుకోండి..

ఏది నిజం.. ఏది అబద్దం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
Heart Attack
Follow us on

ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారత్‌తో సహా ప్రపంచంలో ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. 2024 సంవత్సరం గురించి మాట్లాడుకున్నట్లయితే.. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గత దశాబ్దంలో, భారతదేశంలో గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య వేగంగా పెరిగింది. గత 10 ఏళ్లలో భారతదేశంలో గుండెపోటు కారణంగా 2 లక్షల మందికి పైగా మరణించారని ఒక నివేదిక పేర్కొంది. ప్రపంచంలో గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య భారత్‌లోనే ఎక్కువ. అయితే.. ఈ తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గుండెపోటు సాధారణ లక్షణాలు..

ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, అలసట, బలహీనత, చేతులు, వెన్ను, మెడ లేదా దవడలో నొప్పి, మైకము, మూర్ఛ.. లాంటి లక్షణాలు కనిపిస్తాయి..

ఈ లక్షణాలలో ఏవైనా మీకు అనిపిస్తే, మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకోవడం మంచిది.

గుండె సంబంధిత నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రజల రోజువారీ దినచర్య, అసమతుల్య ఆహారం, ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు ప్రాథమికంగా పెరుగుతున్నాయి. ఈ బిజీ లైఫ్‌లో ప్రజలు తమ ఆరోగ్యంపై అంత సీరియస్‌గా ఉండరు. నేడు, చాలా ఇళ్లలో లంచ్, డిన్నర్‌లలో ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు లాంటివి ఉంటున్నాయి.. ఇది మన శరీరానికి ప్రమాదకరం. ఫాస్ట్ ఫుడ్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. దీంతో గుండె జబ్బుల సమస్య వేగంగా పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో గుండె జబ్బులకు సంబంధించిన అనేక అపోహలు, పుకార్లు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి.. ఇది ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ అపోహలు, పుకార్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని సాధారణ పుకార్లు, వాటి వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకుందాం..

ఛాతీ నొప్పి రాకపోతే గుండెకు ఎలాంటి ఇబ్బంది ఉండదు…

మీరు ఆరోగ్యంగా ఉండి.. ఛాతీ నొప్పి లేకపోతే, మీకు గుండె జబ్బులు ఉండవని అర్థం కాదు. కొన్నిసార్లు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి కారకాలు ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తల తిరగడం, దవడ లేదా భుజంలో నొప్పి కూడా గుండె జబ్బులకు సంకేతాలు కావచ్చు. ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం చాలా ముఖ్యం.

వృద్ధులు మాత్రమే గుండె జబ్బులతో బాధపడుతున్నారు..

ఈ భావన పూర్తిగా తప్పు.. ఏ వయసులోనైనా గుండె జబ్బులు రావచ్చు. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి వంటి అలవాట్లు యువ తరాన్ని ఈ వ్యాధి వైపు నెట్టివేస్తున్నాయి.

పురుషులకు మాత్రమే గుండె జబ్బులు వస్తాయి..?

గుండె జబ్బులు పురుషులకు మాత్రమే వస్తాయని అనుకోవడం తప్పు. పురుషులతో పాటు స్త్రీలు కూడా గుండె జబ్బుల బారిన పడవచ్చు. హార్మోన్ల మార్పులు, గర్భధారణ సమయంలో సమస్యలు, రుతుక్రమం ఆగిపోయిన స్థితి.. మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

నెయ్యి, వెన్న తినకూడదు..

పరిమిత పరిమాణంలో నెయ్యి, వెన్న తీసుకోవడం శరీరానికి హానికరం కాదు. అధిక వినియోగం మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. బదులుగా, సమతుల్య ఆహారం తీసుకోవడం, నెయ్యి, వెన్న సరైన మొత్తంలో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎక్కువ వ్యాయామం చేయడం మంచిది..

వాస్తవానికి వ్యాయామం చేయడం మంచిదే.. కానీ అధిక వ్యాయామం గుండెకు హానికరం. ప్రతిరోజూ 30-45 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇంతకంటే ఎక్కువ వ్యాయామం చేస్తే రోగాలను ఆహ్వానిస్తున్నట్టే..

కావున గుండెపోటు.. ఛాతీ నొప్పి విషయాల్లో అలసత్వం మంచిది కాదు.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు వైద్యులు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..