చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడొచ్చు.. కళ్ల దానం గురించి మీకు తెలియని నిజాలు..
Eye Donation: మీ మరణం తర్వాత కూడా మీరు ఈ లోకాన్ని చూడగలరు. అవును నేత్రదానం ద్వారా ఇద్దరు వ్యక్తులకు చూపునిచ్చే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అయితే నేత్రదానం గురించి సమాజంలో ఉన్న అపోహలు, భయాల వల్ల ఎంతోమంది ఈ సువర్ణావకాశాన్ని కోల్పోతున్నారు. చనిపోయిన తర్వాత ఎన్ని గంటల లోపు కళ్లు సేకరించాలి? ఎవరు దానానికి అర్హులు? అనేది తెలుసుకుందాం..

నేత్రదానం – అత్యుత్తమ దానం అని అంటుంటారు. కానీ వాస్తవానికి అవగాహన లేక ఎన్నో విలువైన కళ్లు మట్టిలో కలిసిపోతున్నాయి. ఒక వ్యక్తి మరణం తర్వాత వారి కళ్లతో మరొక ఇద్దరు అంధులకు చూపునిచ్చే గొప్ప అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని అపోహలు ఈ మహత్కార్యానికి అడ్డుపడుతున్నాయి. నేత్రదానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..
అపోహలు vs వాస్తవాలు
మొత్తం కన్ను తీస్తారా?: లేదు.. కేవలం పైన ఉండే నల్లగుడ్డు మాత్రమే సేకరిస్తారు. దీనివల్ల ముఖం వికృతంగా మారదు.
బతికుండగానే తీస్తారా..? అలా తియ్యరు. చనిపోయాక మాత్రమే కళ్లు తీస్తారు
వయస్సు అడ్డంకా?: నేత్రదానానికి వయస్సుతో సంబంధం లేదు. వృద్ధులు కూడా దానం చేయవచ్చు.
అద్దాలు వాడేవారు ఇవ్వొచ్చా?: అద్దాలు ధరించేవారు, కంటిశుక్లం సర్జరీ అయిన వారు, బీపీ, షుగర్ ఉన్నవారు కూడా నేత్రదానానికి అర్హులే.
అంత్యక్రియల ఆలస్యం: కార్నియా సేకరించడానికి కేవలం 15-20 నిమిషాలు మాత్రమే పడుతుంది. కాబట్టి ఎటువంటి ఆలస్యం జరగదు.
ఎవరు నేత్రదానం చేయకూడదు?
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కళ్లను సేకరించరు..
- ఎయిడ్స్, హెపటైటిస్ బి లేదా సి, సెప్సిస్, రాబిస్, లుకేమియా వంటి వ్యాధులు ఉన్నవారి కళ్లను తీసుకోరు.
- మరణానికి గల కారణం స్పష్టంగా తెలియనప్పుడు నేత్ర సేకరణ చేయరు.
మరణించినప్పుడు బంధువులు చేయాల్సిన పనులు
ఒక వ్యక్తి మరణించిన 6 నుండి 8 గంటల లోపు నేత్ర సేకరణ జరగాలి. అప్పుడు కుటుంబ సభ్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..
- వెంటనే సమీపంలోని ఐ బ్యాంక్‌కు సమాచారం అందించాలి.
- మరణించిన వ్యక్తి కనురెప్పలను మూసి ఉంచాలి.
- గదిలోని ఫ్యాన్ ఆపివేయాలి
- తల కింద దిండు ఉంచి, తలను కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి.
- మరణ ధృవీకరణ పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి.
మతం లేదా మూఢనమ్మకాలు ఏవీ నేత్రదానానికి అడ్డంకి కావు. మన జీవితం ముగిసినా, మరొకరి జీవితంలో కాంతిని నింపే ఈ గొప్ప దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.
