40 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ శరీరంలో ఈ 3 పోషకాలు తగ్గినట్టే

మహిళల ఆరోగ్యం విషయంలో 40 ఏళ్లు అనేది ఒక కీలకమైన మలుపు. ఈ సమయంలో శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. రయన్ ఫెర్నాండో ప్రకారం, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి12 అనేవి ఒక జట్టుగా పనిచేస్తాయి. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మిగిలినవి సరిగ్గా పనిచేయవు. ఈ మూడు పోషకాల ప్రాముఖ్యత, అవి లభించే ఆహార పదార్థాల వివరాలు తెలుసుకుందాం.

40 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ శరీరంలో ఈ 3 పోషకాలు తగ్గినట్టే
Nutrients For Women Over 40.jpg

Updated on: Mar 12, 2026 | 6:30 AM

వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళల్లో తరచుగా నీరసం, ఎముకల నొప్పులు, అకస్మాత్తుగా లేచి నిలబడినప్పుడు కళ్లు తిరగడం లేదా కళ్ల ముందు నల్లటి చుక్కలు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది వీటిని కేవలం అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఇవి శరీరంలో పోషకాల లోపానికి సంకేతాలు కావచ్చని ప్రముఖ ఒలింపిక్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ రయన్ ఫెర్నాండో హెచ్చరిస్తున్నారు. అనుష్క శర్మ వంటి తారలకు డైట్ ప్లాన్ రూపొందించిన ఫెర్నాండో, 40 దాటిన మహిళలకు అవసరమైన కీలక పోషకాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఐరన్- శరీరంలోని ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను అన్ని భాగాలకు చేరవేయడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడి విపరీతమైన నీరసం, బలహీనత కలుగుతాయి. రోజుకు 18 మి.గ్రా ఐరన్ తీసుకోవాలి. బచ్చలికూర, గుప్పెడు డ్రై ఫ్రూట్స్, ఆర్గాన్ మీట్స్ ద్వారా దీనిని పొందవచ్చు.

ఫోలేట్- ఫోలేట్ లేకపోతే శరీరం ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను తయారు చేయలేదు, ఐరన్‌ను సరిగ్గా గ్రహించలేదు. రోజుకు 400 మి.గ్రా ఫోలేట్ అవసరం. ఒక బీట్‌రూట్, ఒక నారింజ పండు లేదా ఒక కప్పు ఉడికించిన బ్రోకలీని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

విటమిన్ బి12- మెదడు, నరాల ఆరోగ్యాన్ని కాపాడటంలో, అలాగే డీఎన్ఏ తయారీలో బి12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో ఫోలేట్ సరిగ్గా ఉపయోగపడటానికి సహాయపడుతుంది. బి12 లోపిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఎముకల బలహీనత వచ్చే ప్రమాదం ఉంది. రోజుకు 2.6 మైక్రో గ్రాములు. పాలు, చేపలు లేదా ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాల ద్వారా బి12 లభిస్తుంది.

ఫోలేట్, విటమిన్ బి12 రెండూ ఒకేచోట లభించే అద్భుతమైన ఆహారం గుడ్డు. రోజుకు కేవలం రెండు గుడ్లు తినడం వల్ల ఈ పోషకాల లోపాన్ని సులభంగా భర్తీ చేయవచ్చని న్యూట్రిషనిస్ట్ సూచిస్తున్నారు. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను గమనిస్తూ, తగిన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం. పైన పేర్కొన్న లక్షణాలు మీకు కనిపిస్తే, ఒకసారి రక్త పరీక్ష చేయించుకుని మీ శరీరంలో పోషకాల స్థాయిని తెలుసుకోండి. వైద్యుని సంప్రదించి అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా 40 ఏళ్ల తర్వాత కూడా మీరు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us