కరోనా టీకా తయారీ తెలంగాణకే గర్వకారణం.. ముందుగా మాకే ఇవ్వాలన్న ఈటెల..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి మందు తయారుచేసే అదృష్టం తెలంగాణకు కలగడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్.

  • Balaraju Goud
  • Publish Date - 9:29 pm, Fri, 27 November 20
కరోనా టీకా తయారీ తెలంగాణకే గర్వకారణం.. ముందుగా మాకే ఇవ్వాలన్న ఈటెల..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి మందు తయారుచేసే అదృష్టం తెలంగాణకు కలగడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ ద్వారా ఈ వాక్సిన్ అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డమీద ఈ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్న మంత్రి.. ముందుగా వ్యాక్సిన్ ను మన రాష్ట్ర ప్రజలకు అందించాలని ఆయన కోరారు.

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు ప్రజలు పాటిస్తూ మాస్కులు వాడుతూ ఆరోగ్య నియమాలు పాటిస్తున్నందుకు ఆయన దన్యవాదాలు తెలిపారు. ఇక, ప్రపంచవ్యాప్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ముందు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గమన్న మంత్రి.. అత్యంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి జరుగుతుందన్నారు. కాగా, తెలంగాణలోనే ఈ వ్యాక్సిన్ తయారవుతున్నందున, తొలుత ఇక్కడి ప్రజలకు పూర్తిస్థాయిలో టీకాను ముందుగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.