ఆ రిలేషన్‌షిప్‌లో నరకం చూశా.. బయటకు వచ్చాకే ప్రశాంతంగా ఉంది..

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి నిత్యా మేనన్. అందం కంటే అభినయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు.

ఆ రిలేషన్‌షిప్‌లో నరకం చూశా.. బయటకు వచ్చాకే ప్రశాంతంగా ఉంది..
Nithyamenen

Updated on: Nov 25, 2026 | 12:30 PM

సహజమైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలుచుకున్న జాతీయ అవార్డు విజేత నిత్యా మీనన్, తన వ్యక్తిగత జీవితం మరియు వివాహ ఆలోచనలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పే ఆమె, తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన గత ప్రేమ బంధాలు, ఒంటరి జీవితంపై ఉన్న అపోహలకు తెరదించారు.  తన గత రిలేషన్‌షిప్స్ ఎందుకు విఫలమయ్యాయి, వాటి నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందనే ప్రశ్నకు నిత్య  స్పందించారు. “మన ఆత్మను, వ్యక్తిత్వాన్ని అణచివేసే పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ బంధంలో కొనసాగడం కరెక్ట్ కాదు. ఎదుటివారి ప్రభావం వల్ల మనం ఎదగలేకపోతున్నామని, కనీసం స్వేచ్ఛగా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నామని అనిపించినప్పుడు అక్కడి నుంచి తప్పుకోవడమే ఉత్తమం” అని ఆమె స్పష్టం చేశారు.

గతంలో తాను ఉన్న కొన్ని బంధాలు తన ఆలోచనలకు, పనులకు అడ్డుకట్ట వేశాయని నిత్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను చాలా బలహీనంగా మారిపోయిన భావన కలిగిందని, ఆ ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం నుంచి బయటకు అడుగుపెట్టిన తర్వాతే తనకు నిజమైన ప్రశాంతత దొరికిందని వివరించారు. అది భయంతో తీసుకున్న నిర్ణయం కాదని, తనపై తనకు కలిగిన ఒక స్పష్టమైన అవగాహన అని తేల్చిచెప్పారు. నిత్యా మీనన్ ఇప్పటికీ సింగిల్‌గా ఉండటంతో ఆమెకు అసలు వివాహ వ్యవస్థపైనే నమ్మకం లేదనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంటుంది. దీనిపై ఆమె స్పందిస్తూ..

“నేను పెళ్లి చేసుకోనని ఎప్పుడూ చెప్పలేదు. నాకూ వివాహ బంధంపై ఎంతో గౌరవం ఉంది, పెళ్లి చేసుకోవాలనే ఆశ కూడా ఉంది. కానీ అందరూ చేసుకుంటున్నారనో, లేక వయసు పెరిగిపోతోందనో మొక్కుబడిగా పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు” అని కుండబద్దలు కొట్టారు. తనకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలో కూడా నిత్య ఈ సందర్భంగా వివరించారు. “నాకు కావాల్సింది కేవలం ఒక పెళ్లి తంతు కాదు, జీవితాంతం నడిచే ఒక సరైన తోడు. నా వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చే వ్యక్తి దొరికితేనే వివాహ బంధంలోకి అడుగుపెడతాను. ఒకవేళ అలాంటి భాగస్వామి దొరక్కపోతే, జీవితాంతం ఒంటరిగా, ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాను” అంటూ నిత్యా మీనన్ తన ఆలోచనలను స్పష్టం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us