మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, స్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న క్రమంలో ఇటీవల మెగాస్టార్ గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సె్స్ ను విలేఖరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌తో నటించాలని తనకు ఉందని.. అన్నీ కుదిరితే తప్పుకుండా చేస్తామన్నారు.
పవన్ కళ్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా ? అని విలేకరి అడగ్గా.. చిరు స్పందిస్తూ.. ” మా తమ్ముడి తో చేయాలనే సరదా నాకు వుంటుంది. అన్నయ్యతో చేయాలని తనకీ వుంటుంది. అన్నీ కుదిరిన రోజున కలసి సినిమా చేయాలనీ నాకు చాలా ఉత్సాహంగా వుంది.” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. ఇతర పరిశ్రమల నుంచి తనకు ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా ‘ఇండియన్ సినిమా’ అనే పేరు రావాలని నా కోరిక. బాహుబలి, కే జీ ఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఎల్లలు చేరిగిపోయాయనే భావిస్తాను. ఇది మంచి పరిణామం అని అన్నారు.
” సినిమాని సమిష్టి కృషి అని నమ్ముతాను. ఒక విజయం వెనుక సమిష్టి కృషి వుంటుంది. అందుకే ఒక విజయం కేవలం నాదీ అని అనుకోను. ఏప్రిల్ లో వచ్చిన గత చిత్రం నిరాశ పరిచింది. దానికి చేయాల్సిన ధర్మం చేశాను. దానిని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తం నాది కాదని వదిలేశాను. రామ్ చరణ్ కూడా వదిలేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లుని కాపాడుతుందనే సంతృప్తి నన్ను ఫ్లాఫ్ కి క్రుంగిపోయేలా చేయలేదు. గాడ్ ఫాదర్ విజయం కూడా కేవలం నాదీ అని అనుకోను. గాడ్ ఫాదర్ విజయం సమిష్టి కృషి. లూసిఫర్ ని చూసినప్పుడు అలాంటి పాత్రలు చేసి యాక్సప్టెన్సీ తెచ్చుకోగలిగితే మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేసే అవకాశం ఉంటుందనే ఆలోచన వుండేది. చరణ్ బాబు ఒక రోజు లూసిఫర్ ప్రస్తావన తీసుకొచ్చారు. దర్శకుడు సుకుమార్ చిన్న చిన్న మార్పులు చేస్తే లూసిఫర్ నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పారట. చరణ్ బాబు ఇలా చెప్పిన తర్వాత మరోసారి లూసిఫర్ చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చారు కానీ తర్వాత అందుబాటులో వుండలేదు. తర్వాత ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపాం. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పారు. తని వరువన్ ని అద్భుతంగా తీసిన దర్శకుడు మోహన్ రాజా. లూసిఫర్ రీమేక్ మోహన్ రాజా న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. మోహన్ రాజా కి కూడా ఇది ఇష్టమైన సబ్జెక్ట్. చేస్తానని చాలా ఉత్సాహంగా చెప్పారు. రచయిత సత్యనంద్ తో కూర్చుని టీం అంతా చాలా చక్కని మార్పులు చేర్పులు చేసి గాడ్ ఫాదర్ ని అద్భుతంగా మలిచారు” అని అన్నారు చిరు.