ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. మహేష్ బాబు గుంటూరు కారం, దళపతి విజయ్ గోట్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్, వరుణ్ తేజ్ తో మట్కా తో పాటు మరో తమిళ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ యాక్ట్ చేసింది.ఇందులో లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టగా, దళపతి విజయ్ సినిమా గోట్ కూడా తమిళంలో రికార్డు వసూళ్లు సాధించింది. ఇలా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న మీనాక్షి గురించి ఇటీవల ఒక వార్త తెగ వైరలవుతోంది. అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందట. టాలీవుడ్ లో బాగా పేరున్న ఒక పెద్ద కుటుంబానికి చెందిన యంగ్ హీరోతో కలిసి ఈ అందాల తార ఏడడుగులు వేయనుందని ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు గానీ మీనాక్షి చౌదరి పెళ్లి వ్యవహారం మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటివరకు అటు మీనాక్షి నుంచి కానీ సదరు హీరో, ఫ్యామిలీ నుంచి కానీ ఈ విషయంపై స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఎట్టకేలకు ఈ రూమర్లపై మీనాక్షి స్పందించిందని తెలుస్తోంది. ‘ ప్రస్తుతానికి నేను సింగల్ గా ఉన్నాను. త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. ప్రతి నెలలో నాకు కొత్త రిలేషన్ షిప్ లేదా కొత్త సినిమా గురించి రూమర్స్ పుట్టించడం సర్వసాధారణం అయిపోయింది’ అని మీనాక్షి చెప్పిందట. తద్వారా తన పెళ్లిపై వస్తోన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిందీ అందాల తార.
వాస్తవానికి మీనాక్షి చౌదరి ఆ హీరో సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మూడేళ్ల క్రితం ఈ సినిమా రిలీజై యావరేజ్ గా నిలిచింది. అయితే ఇప్పటికీ మీనాక్షి చౌదరి, ఆ హీరో రెగ్యులర్గా టచ్లో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారని ప్రచారమూ సాగింది. అయితే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని హీరో సన్నిహితులు చెప్తున్నారు. తాజాా మీనాక్షి చౌదరి కూడా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.