డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ రికార్డ్స్ కొల్లగొట్టింది. పాన్ ఇండియా లెవల్లో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్‌లో చాప్టర్ గురించి హింట్ ఇవ్వడంతో ఈ సినిమాపై ఇప్పటికే క్యూరియాసిటి ఏర్పడింది. ఈ మూవీతో యశ్, ప్రశాంత్ నీల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ప్రస్తుతం డైరెక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు యశ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక మరోవైపు కేజీఎఫ్ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ 3 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో యశ్.
శనివారం ముంబైలో జరిగిన ఇండియా టూడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ పై స్పందించారు యశ్. ” కేజీఎఫ్ సిరీస్‌లోని రెండు సినిమాలను ఆడియన్స్ ఎంతో ఆదరించి మా అందరినీ సక్సెస్ చేశారు. కేజీఎఫ్ 3 త్వరలోనే రాబోతుందని నేను భావించడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న వార్తలలో నిజం లేదు. వాటిని ప్రేక్షకులు నమ్మకూడదు. ఈ సినిమా గురించి ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి త్వరలోనే అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత 6, 7 సంవత్సరాలుగా కేజీఎఫ్ చిత్రాలు చేస్తున్నాను..ఇక కేజీఎఫ్ 3 చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నాను. అలాగే పరిశ్రమలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నారు.