
డిస్కో శాంతి.. తెలుగు ఆడియెన్స్ కు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటి జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ90’sలో స్పెషల్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శాంతి. బంగారు కోడి పెట్ట లాంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ లో స్టార్ హీరోలకు సమానంగా స్టెప్పులేసి మెప్పించారు. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈమె సినిమాలు చేశారు. అయితే నటిగా బిజీగా ఉంటోన్న సమయంలోనే నటుడు, రియల్ స్టార్ శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారీ అందాల తార. ఆ తర్వాత క్రమంగా సినిమాలు చేయడం తగ్గించేశారు. చివరగా 1997లో ‘యుద్ధ’ అనే కన్నడ చిత్రంలో కనిపించారు డిస్కో శాంతి. అయితే ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారీ సీనియర్ నటి. ప్రముఖ కొరియో గ్రాఫర్- హీరో- దర్శకుడు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ హీరోగా పరిచయమవుతున్న ‘బుల్లెట్’ సినిమాతో డిస్కో శాంతి రీఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సందర్భంగా డిస్కో శాంతి తన సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటంపై ఎల్విన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక నోట్ పెట్టాడు..
‘సినిమా, పేరు, ప్రఖ్యాతలు, డబ్బుకు అతీతమైన కొన్ని బంధాలు ఉంటాయి. అలాంటి బంధమే నాకు, డిస్కో శాంతి అక్క మధ్య ఉంది. డిస్కో శాంతి మాకు కేవలం ఒక ఆర్టిస్ట్ లేదా సహ నటి మాత్రమే కాదు. నాకు, నా సోదరుడు రాఘవ లారెన్స్‌కు స్వయంగా సోదరి లాంటి వారు. ఎన్నో ఏళ్లుగా ఆమెని ఎంతో ప్రేమగా ‘అక్క’ అని పిలుచుకుంటున్నాం. 28 ఏళ్ల విరామం తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీని వెనుక డబ్బు, పేరు, గుర్తింపు లాంటి కారణాలేం లేవు. చిన్న వయసులోనే తన కష్టంతో, ప్రతిభతో ఎంతో పేరు, గుర్తింపు సంపాదించుకున్న డిస్కో శాంతిని గతంలో చాలా మంది తమ సినిమాల్లో నటించమని అడిగారు. కానీ నా మొదటి సినిమా కోసం ఆమె అంగీకరించడం వెనుక ఉన్న కారణం మాత్రం మాపై ఉన్న ప్రేమ, ఆప్యాయతే. అక్కా.. మీరు ఈ సినిమా చేయడానికి ఎలాంటి కమర్షియల్ ప్రయోజనాన్ని ఆశించలేదు. మీ తమ్ముళ్లపై ఉన్న ప్రేమతోనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. మీరు చూపించిన ప్రేమ, నమ్మకాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ‘బుల్లెట్’లో డిస్కో శాంతి పాత్ర చాలా కీలకం. కథలో వచ్చే ఒక ముఖ్యమైన ట్విస్ట్‌కు ఆమె పాత్రే కారణం. ఆమెని కేవలం నటిగా మాత్రమే కాదు నా అభిమాన నటిగా చూస్తాను’ అని ఎమోషనల్ అయ్యాడు ఎల్విన్. ప్రస్తుతం వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే శ్రీహరి-డిస్కోశాంతిల కుమారుడు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం రాజ్ దూత్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు శ్రీహరి పెద్ద కుమారుడు మేఘాంశ్. ఆ తర్వాత కోతికొమ్మచ్చి అనే సినిమాలోనూ యాక్ట్ చేశాడు. ఇప్పుడీ స్టార్ కిడ్ చేతిలోపలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. స్టూడెంట్, ఆస్మాన్ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు మేఘాంశ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.