దేత్తడి హారిక.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే ఈ ముద్దుగుమ్మకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒక యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టిన హారిక పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించింది. ముఖ్యంగా దేత్తడి హారిక పేరుతో ఆమె చేసిన వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇదే క్రేజ్‌తో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. తన మాటతీరు, ఆటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను మెప్పించింది. టాప్ 5లో నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాత నాగ శౌర్య వరుడు కావలెను, శర్వానంద్ శ్రీకారం తదితర సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసింది. అయితే వెండితెరపై పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌గా బంఫర్ ఆఫర్ కొట్టేసింది హారిక. యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో ఈ తెలుగందం కథానాయికగా ఎంపికైంది. ‘బేబీ’ మూవీతో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయిన సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎస్ కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రొడక్షన్ నెంబర్ ఫోర్ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. అక్కినేని అందగాడు నాగచైతన్య క్లాప్ కొట్టి సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా సంతోశ్, హారికల మూవీకి సంబంధించి ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘కొన్ని ప్రేమ కథలు జీవిత కాలం వెంటాడుతుంటాయి. మన మనసులో ఉండిపోతాయి’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఎందుకంటే ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్లు లిప్‌లాక్ చేసుకుంటూ కనిపించారు. విజువల్స్ చూస్తుంటే బేబీ మూవీ తరహాలోనే ఇది కూడా ఒక హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాకు అద్భుతమైన బాణీలు అందించిన విజయ్ బుల్గానీనే ఈ సినిమాకు కూడా స్వరాలు సమకూరుస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..