
ఎపిసోడ్ ప్రారంభంలో ప్రేక్షకులతో మాట్లాడిన నాగార్జున.. హౌస్‌లో కంటెస్టెంట్ల ప్రవర్తనను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నరేష్ ఆటతీరును ప్రశంసించారు. ఆటతో పాటు తన ప్రవర్తన కూడా బాగుందని, హౌస్‌లో వినోదాన్ని పంచుతున్నాడని అభినందించారు. అంతేకాదు, హౌస్‌లో జరుగుతున్న గొడవలను పరిష్కరించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు నాగ్. కెప్టెన్సీ రూమ్‌కు యాక్సెస్ కల్పిస్తూ నరేష్‌కు ప్రత్యేక అవకాశం ఇచ్చారు. అలాగే అమన్ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తోందని నాగార్జున ప్రశంసించారు. ప్రవర్తనను మార్చుకుంటూ ఆటపై దృష్టి పెట్టడం అభినందనీయమని చెప్పారు. ఇతరులు వెనక్కి లాగాలని ప్రయత్నించినా లక్ష్యం వైపు ముందుకు సాగాలని సూచించారు. మరోవైపు, కష్టమైన టాస్క్‌లో పట్టుదలతో పోరాడిన దేబ్జానీని కూడా అభినందించారు. ఒత్తిడిని తట్టుకుని చివరి వరకు ప్రయత్నించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ముకేష్ ప్రవర్తనపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడటంపై తీవ్రంగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి మాట్లాడటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. నీతూ డాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబట్టారు. మాటలను అదుపులో ఉంచుకోకపోతే ఆటలోనే కాకుండా వ్యక్తిగత ఇమేజ్ విషయంలోనూ నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ముకేష్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. ఇక ఈ వారం శివ ఆట తీరును నాగార్జున ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రతి విషయంలోనూ తనను తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనిలో మంచి ఫైర్ ఉందని అన్నారు.
ఎమోషన్స్ కు లోనుకాకుండా ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు. తన గురించి తెలిసిన వ్యక్తే అలా మాట్లాడటంతో బాధపడ్డానని శివ చెప్పగా, ఆ విషయాలను పక్కనపెట్టి గేమ్‌లో మరింత బలంగా ముందుకు వెళ్లాలని నాగార్జున ప్రోత్సహించారు.వర్షిణి ఆటతీరుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతూతో పోలిస్తే తన ప్రదర్శన ఎలా ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. గతంలో నీతూను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, మాటలతో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలని అన్నారు. తనలో పోరాటపటిమ ఉన్నప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో బయటపెట్టడం లేదని వర్షిణికి అర్థమయ్యేలా చెప్పారు నాగ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.