
తన కెరీర్‌ను “యాక్షన్ ఫిలిం”గా ఏవీఎస్ అభివర్ణించారు. “ఇదొక ఫైటింగ్ స్టోరీ. చివరికి హీరో గెలుస్తాడు, విలన్ ఓడిపోతాడు. నా దృష్టిలో నేనే హీరోను. ఎవరి దృష్టిలో వారే హీరోలు, కాబట్టి నేను గెలుస్తాను” అని ఆయన అన్నారు. కమెడియన్ల పాత్ర గురించి మాట్లాడుతూ, హీరోలు గెలిచారంటే అది కమెడియన్ల గొప్పతనమేనని పేర్కొన్నారు. పెద్ద హిట్ సినిమాలపై ప్రేక్షకులు “కామెడీ చాలా బాగుందిరా” అంటారని, కామెడీ లేని సినిమాలను పర్లేదు బాస్ అంటారని ఉదహరించారు. కామెడీ సినిమా విజయాన్ని నిర్దేశించే పరిస్థితిలో ఉందని, తాను కమెడియన్‌గా తనను తాను ఎప్పుడూ హీరోగానే భావిస్తానని స్పష్టం చేశారు. అలాగే దర్శకత్వం చేయాలనే ఆలోచన తనకు అసలు లేదని ఏవీఎస్ తెలిపారు. జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటని, నిర్మాత రామా నాయుడు గారికి ఒక కథ చెప్పగా, అది ఆయనకు నచ్చి, తన దర్శకత్వ శైలిని మెచ్చుకుని, “నువ్వే డైరెక్ట్ చేయకూడదు?” అని అడిగారని అన్నారు. ఇది తనకు ఊహించని షాక్ అని చెప్పారు. తొలి ప్రాజెక్ట్ తర్వాత, అంకుల్ అనే సినిమాను తానూ నిర్మించానని, దానికి ఆర్థికంగా “సెగ తగిలింది” అని పంచుకున్నారు.
ఎందుకంటే, లవ్ స్టోరీనో, పెద్ద హీరోయిన్నో అయితే నిర్మాతలు ముందుకు వస్తారని, కానీ అంకుల్ వంటి క్యారెక్టర్ కథను నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే నిర్మాతగా మారాల్సి వచ్చిందని వివరించారు. ఈ సినిమా వల్ల “చేతులు కాలినయ్” అని, అది ఇప్పటికీ చల్లారలేదని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత తాను నిర్మాతగా కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఓరి నీ ప్రేమ బంగారం గాను సినిమా చూసి సి.సి. రెడ్డి గారు తనకు దర్శకత్వం అవకాశం ఇవ్వడం, రూమ్మేట్స్, ఆపై తులసి పూజిత ఫిల్మ్స్ బ్యానర్‌పై కోతి మూక చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. తాను తీసిన సినిమాలు వాణిజ్యపరంగా పెద్ద విజయం సాధించకపోయినా, చూసిన ఎవరూ బాగోలేదని అనలేదని, ఇది తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.
ఖాళీ సమయాల్లో కథలు, డైలాగ్ వెర్షన్స్ రెడీ చేసుకుంటూ ఉంటానని, బిజీగా ఉండటంలోనే తాను ఎక్కువ రిలాక్స్ అవుతానని, ఇది తన బలహీనత, బలమని వివరించారు. తన కుటుంబ సభ్యులు తన ప్రతీ పనికి ప్రోత్సాహాన్ని ఇస్తారని, కొత్త జోక్ లేదా వాక్యం పుట్టిన వెంటనే వారికే వినిపిస్తానని చెప్పారు. ప్రస్తుతం ( అప్పటి సమయంలో) కమెడియన్ల పరిస్థితి చాలా బాగుందని, వారికి డిమాండ్ పెరిగిందని ఏవీఎస్ అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో 127 మంది కమెడియన్లు ఉన్నారని, భారతదేశంలో మరే భాషలోనూ ఇంత మంది లేరని తెలిపారు. రచయితలు కూడా కమెడియన్లను దృష్టిలో పెట్టుకుని, వారి వ్యక్తిత్వాలకు తగ్గట్లుగా పాత్రలను సృష్టిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద కమెడియన్లు బిజీగా ఉన్నారని, కామెడీ కూడా బిజీగా ఉందని ఏవీఎస్ తన అభిప్రాయాన్నిపంచుకున్నారు.