Pawan Kalyan: ‘యువకుల మృతి కలచివేస్తోంది’.. బాధిత కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

|

Jan 06, 2025 | 1:54 PM

రాజమండ్రిలో జరిగిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నిర్మాత దిల్ రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Pawan Kalyan: యువకుల మృతి కలచివేస్తోంది.. బాధిత కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
Ap Deputy Cm Pawan Kalyan
Follow us on

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతూ కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిల్ రాజు మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ కూడా మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరమన్నారు. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
‘ ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’

‘కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. అయిదు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. రెండు నగరాల మధ్య ప్రయాణాలకు కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్లు మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండుసార్లు చెప్పడమైంది. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

పవన్ కల్యాణ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.