
ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఈసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను వరించింది. ఈ అవార్డు కోసం బిగ్‌బీని ఏకగ్రీవంగా ఎంపికచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. అమితాబ్ ఇప్పటివరకు 200 పైచిలుకు సినిమాల్లో నటించారు. 4 జాతీయ పురస్కారాలు, 15 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. జంజీర్, దీవార్, షోలే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన యాంగ్రీ యంగ్‌మన్‌గా పేరు తెచ్చుకున్నారు. కాలానికి తగినట్లు పాత్రలు ఎంచుకుంటూ నటనలో నూతన మైలురాళ్లు అందుకున్నారు. గొప్ప అవార్డు వరించడంతో భారతీయ చలనచిత్ర ప్రముఖులు బిగ్ బీకి అభినందనలు తెలియజేస్తున్నారు. సినీ ఇండష్ట్రీలో విశిష్ట సేవలకుగానూ ఏటా ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. గతేడాది బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు అందజేశారు. అంతకుముందు తెలుగు దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ సొంతం చేసుకున్నారు. తొలిసారిగా 1969లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకు 65 మంది సినీ ప్రముఖులకు ఈ అవార్డును అందజేశారు.