
అక్కినేని అందగాడు హీరో అఖిల్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. కాబోయే జంట ఫొటోలను కూడా అందులో షేర్ చేశాడు. దీంతో అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ‘అయ్యగారు సడెన్ గా ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారేంటి’? అని సినీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
‘‘జైనబ్‌తో మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి’ అని నాగార్జున పోస్ట్ పెట్టారు. అలాగే అఖిల్ కూడా తన శుభవార్తను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో పంచుకున్నాడు.
కాగా అఖిల్ కు కాబోయే భార్య జైనాబ్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో ఈమె సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా అని తెలుస్తోంది. వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తోంది.