
నటి రేణూదేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సామాజి స్పృహ మెండుగా ఉన్న ఆమె సామాజిక సమస్యలపై తన దైన శైలిలో గళం వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల రక్షణపై తన అభిప్రాయాలు పంచుకుంటోంది. అయితే ఇదే సమయంలో కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వీధి కుక్కల దాడులపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై సోషల్ మీడియా వేధికగా జరుగుతోన్న ఈ వేధింపులపై నటి రేణూ దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన పర్సనల్ లైఫ్, పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నీచమైన మాటలతో ట్రోల్ చేస్తున్న వారి స్క్రీన్ షాట్లను పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేసింది. కాగా ఇటీవల తనపై జరుగుతోన్న ఆన్ లైన్ ట్రోలింగుపై ఓ వీడియోను రిలీజ్ చేసింది రేణూ దేశాయ్. అందులో తన వ్యక్తిత్వాన్నే కాకుండా, శరీర భాగాల గురించి, పిల్లల గురించి అత్యంత దారుణమైన భాషలో కామెంట్స్ చేశారని వాపోయింది. కాశీ లాంటి పవిత్ర స్థలంలో ఉన్నప్పుడు కూడా మాటలతో దాడి చేసే స్థాయికి కొందరు దిగజారారని ఆమె కన్నీటి పర్యంతమైంది.
ఈ క్రమంలోనే వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో రేణు దేశాయ్ తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారి వివరాలను, ఆ కామెంట్స్ స్క్రీన్ షాట్లను పోలీసులకు అందజేశారు. సోషల్ మీడియాలో వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది రేణూ దేశాయ్. నటి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఒక వీడియోను రిలీజ్ చేసింది రేణూ దేశాయ్. అందులో ట్రోలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందీ అందాల తార. ‘మరోసారి ఎవరైనా నాపై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తే, నేరుగా వారి ఇంటికి వెళ్లి ఆ కామెంట్స్ వారి కుటుంబ సభ్యులకు చూపిస్తాను. ఇక సెలబ్రిటీలు అంటే ఎవరైనా ఏదైనా అనవచ్చు అనే ధోరణి మారాలి. ప్రతి మనిషికి గౌరవం ఉంటుంది. అది సెలబ్రిటీ అయినా సామాన్యులైనా ఒకటే. కేవలం వ్యూస్ కోసం, ఫాలోవర్ల కోసం ఒక మహిళను ఇంతలా వేధించడం భావ్యం కాదు’ అని వీడియోలో చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.