
ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇడుపు కాయితం సినిమాతో కథానాయికగా పరిచయం కాబోతున్న ఆమె.. అటు తమిళంలో లవ్ ఓ లవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్లో భాగంగా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోవడంపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె తన సినీ ప్రయాణం, కూచిపూడి నుండి జానపద నృత్యానికి మారడం, సందేశాత్మక చిత్రాల ఎంపిక గురించి కూడా మాట్లాడారు. నాగ దుర్గ మాట్లాడుతూ, “నేను డిగ్రీ చదువుతున్న సమయంలో, జర్నలిజం కోర్సు చేస్తున్నాను. ఆ సమయంలోనే శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సాయి పల్లవి స్నేహితురాలి పాత్రకు అవకాశం వచ్చింది. కానీ నా పరీక్షల కారణంగా నేను ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. విద్య తన జీవితంలో అత్యంత ముఖ్యమైనదని, అందుకే తాను ఎప్పుడూ ఏ సినిమా ఆఫర్‌ను అంగీకరించినా, అది విద్యకు అడ్డంకి కాకూడదని స్పష్టం చేశారు. కేవలం శ్యామ్ సింగరాయ్ మాత్రమే కాదు, ఇతర ఆఫర్‌లను కూడా విద్య కారణంగానే నిరాకరించినట్లు ఆమె తెలిపారు.
కూచిపూడి డ్యాన్సర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నాగ దుర్గ, జానపద నృత్యం (ఫోక్) పట్ల ఆకర్షితులయ్యారు. “నేను మొదటి నుండి కూచిపూడి నృత్యానికి గౌరవం ఇస్తాను. కూచిపూడి డాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా నాకు ఎప్పుడూ ఒక గుర్తింపు ఉండేది. కానీ ఫోక్ డాన్స్ లోకి ప్రవేశించిన తర్వాత ఆ గుర్తింపు మరింత పెరిగింది” అని ఆమె వివరించారు. అది సోషల్ మీడియా మహిమ కావచ్చు, లేదా జనాల ఆసక్తులు మారడం కావచ్చునని ఆమె అన్నారు. ఫోక్ సాంగ్స్ ఇప్పుడు చాలా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయని, నాలుగు-ఐదు సంవత్సరాల క్రితం 100-150 మిలియన్ వ్యూస్ రావడం అప్పట్లో చాలా పెద్ద విషయమని గుర్తు చేసుకున్నారు. ప్రజలు జానపద నృత్యానికి చూపిస్తున్న ఆసక్తిని చూసి సంతోషిస్తున్నట్లు తెలిపారు.
నాగ దుర్గ తన చిత్రాల ఎంపిక గురించి మాట్లాడుతూ, “నేను సినిమాను అంగీకరించాలంటే, అందులో ఏదో ఒక సందేశం ఉండాలి” అనే సూత్రాన్ని అనుసరిస్తానని చెప్పారు. ఆమె నటించిన కలివనం చిత్రం మంచి సందేశాన్ని కలిగి ఉందని, అది జానపద చిత్ర పరిశ్రమలోని డైరెక్టర్ల సహకారంతో రూపొందించబడిందని పేర్కొన్నారు. కలివనంలో హీరో లేడని, కేవలం హీరోయిన్, ఆమె తాత పాత్రలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇటీవల విడుదలైన ఇడుపు కాయితం కూడా ఒక మంచి సందేశాన్ని అందించిందని ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?