Pawan Kalyan: వెండితెర నుంచి రాజకీయాల వరకు.. అలుపెరుగని జనసేనాని..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఈ పేరుకు ఉండే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. సినీరంగంలో నటుడిగా, పవర్ స్టార్ గా ఎన్నో రికార్డులు సృష్టించి ఇప్పుడు రాజకీయాల్లో ప్రజాసేవకు సరికొత్త నిర్వచనం చెప్పారు. ఓటములు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో జనసేనను నడిపించి గెలిపించారు. ఇన్నాళ్లు తన నటనతో, సినిమాలతో అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే.

Pawan Kalyan: వెండితెర నుంచి రాజకీయాల వరకు.. అలుపెరుగని జనసేనాని..
Pawan Kalyan

Updated on: Sep 02, 2026 | 9:37 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని ‘పవర్ స్టార్’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వైబ్ గురించి చెప్పక్కర్లేదు. నటుడి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ‘పవర్‌హౌస్ లీడర్‌’గా ఎదిగిన వైనం అసాధారణమైనది. సినిమాల్లో గ్లామర్, యాక్షన్, ప్రత్యేకమైన మేనరిజంతో యూత్‌ను ఉర్రూతలూగించిన ఆయన, ప్రజాక్షేత్రంలో మాత్రం ముళ్ల బాటను ఎంచుకున్నారు. ఆటుపోట్లను, ఓటములను లెక్కచేయకుండా కఠిన శ్రమతో ముందుకు సాగి, నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఈరోజు (సెప్టెంబర్ 2న) పవన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు ఘనంగా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. మరోవైపు సినీ, రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించారు పవన్. అసలు పేరు కళ్యాణ్ కుమార్.. ఇంట్లో అందరూ ముద్దుగా కళ్యాణ్ బాబు అని పిలుచుకుంటారు. తండ్రి ఉద్యోగరీత్య వివిధ ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల యాసలు, సంస్కృతులు ఆయన చిన్నతనం నుంచే దగ్గరిగా చూశారు. 1996లో ‘అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న మక్కువతో ‘పవన్’ బిరుదును పొంది పవన్ కళ్యాణ్‌గా మారారు. ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘ఖుషీ’, ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. గతేడాది ‘ఓజీ’ చిత్రంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

సమాజం పట్ల ఉన్న బాధ్యతతో రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్, 2014 మార్చిలో ‘జనసేన పార్టీ’ని స్థాపించారు. స్వచ్ఛమైన రాజకీయాలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సుదీర్ఘ పోరాటం సాగించారు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటములు, ప్రత్యర్థుల విమర్శలు ఆయనను నిరుత్సాహపరచలేదు. సరికదా మరింత కసితో ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై గళం విప్పారు. రాజకీయ వ్యూహాలతో, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో పాటు, పోటీ చేసిన స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేనను గెలిపించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పాలనలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమించే పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమ, పట్టుదల కోట్లాది మంది యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

Loading...
Unable to load recommendations.
Follow Us