
ఓటీటీ ప్రియులకు ఈ వారం వినోదాల విందు కనువిందు చేస్తోంది. తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ‘కామ్రేడ్ కళ్యాణ్’, ‘మీర్జాపూర్’, ‘సిగ్మా’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘బత్తా’, ‘అవరచన్ బాయ్స్’, ‘ఎస్సై యుగంధర్’, ‘ఇమ్మోర్టల్’ వంటి సినిమాలు, అలాగే అక్క, రుద్రవనం పీ ఎస్ వంటి సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మరో క్రేజీ తెలుగు రొమాంటిక్ మూవీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన సుమారు మూడు నెలల తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. అదే ‘అదే నీవు అదే నేను’. కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యశ్వంత్ పెండ్యాల ఈ చిత్రంలో హీరోగా నటించారు. తన్వీ నేగి హీరోయిన్గా నటించగా, త్రినాథ్ వర్మ మరో కీలక పాత్రలో కనిపించారు. గతేడాది జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అయితే, ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
కొత్తగా పెళ్లైన సాగర్ (యశ్వంత్ పెండ్యాల), శ్రీవల్లి (తన్వీ నేగి) దంపతులు ఒక గేటెడ్ కమ్యూనిటీలో తమ కొత్త కాపురాన్ని ప్రారంభిస్తారు. సాగర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, శ్రీవల్లి గృహిణిగా ఉంటుంది. సాగర్ తల్లి సావిత్రి (కల్పలత) కూడా కోడలిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. వీరి కుటుంబం ఎంతో సంతోషంగా సాగిపోతుంటుంది. అయితే, శ్రీవల్లి జీవితంలోకి అనుకోకుండా కార్తీక్ (త్రినాథ్ వర్మ) ప్రవేశిస్తాడు. కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కార్తీక్.. ఒక ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్‌కు వచ్చి, అదే అపార్ట్మెంట్లో శ్రీవల్లి ఫ్లాట్‌కు ఎదురుగా ఉండే ఫ్లాట్‌లో నివసించడం మొదలుపెడతాడు. మంచి మాటతీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే కార్తీక్, క్రమంగా శ్రీవల్లికి దగ్గరవుతాడు. ఈ పరిచయం కాస్తా ఆకర్షణగా మారుతుంది.
శ్రీవల్లికి ఇప్పటికే పెళ్లయిందనే విషయం తెలిసినా.. కార్తీక్ తన ఇష్టాన్ని తగ్గించుకోడు. మరోవైపు తాను చేస్తున్నది తప్పని తెలిసినా, శ్రీవల్లి అతనికి దూరంగా ఉండలేకపోతుంది. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్న సమయంలో, కార్తీక్ ఒక అడుగు ముందుకేసి శ్రీవల్లి ముందు పెళ్లి ప్రస్తావన తెస్తాడు. అదే సమయంలో తన భర్త సాగర్ గురించి శ్రీవల్లికి కొన్ని ఊహించని నిజాలు తెలుస్తాయి. సాగర్ గురించి శ్రీవల్లికి తెలిసిన ఆ నిజాలేంటి?, కార్తీక్ నిజంగానే శ్రీవల్లిని ప్రేమించాడా?, ఈ ఇద్దరిలో శ్రీవల్లి ఎవరిని ఎంచుకుంది?, చివరకు ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘అదే నీవు అదే నేను’ సినిమా కథ. ప్రేమ, ఆకర్షణ, వివాహ బంధాలు, వ్యక్తిగత నిర్ణయాల నేపథ్యంలో సాగే కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఒకసారి పరిశీలించదగిన చిత్రం. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఇంటి వద్దే ప్రశాంతంగా సినిమా చూసేయాలని భావించేవారికి ఇది మంచి ఆప్షన్. ఈ వీకెండ్లో కొత్త తెలుగు సినిమా చూడాలనుకునేవారు ‘ఆహా’లో ఈ మూవీని మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి