
ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’
థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం 2026 జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకున్నప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల నుండి ఈ సినిాకు సానుకూల స్పందన లభించలేదు.భారతదేశంలో ఈ చిత్రం సుమారు రూ. 6.67 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 8.16 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
అయితే ఇప్పుడు ఓటీటీలో’భారత్ భాగ్య విధాత’ సినిమా ఇమేజ్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 14న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఓటీటీలో విడుదలైన తర్వాత, ‘భారత్ భాగ్య విధాత’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్‌కు చేరుకున్నట్లు చెబుతున్నారు. ‘భారత్ భాగ్య విధాత’ కథ 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో రూపొందించారు.. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలోని నర్సులు ప్రదర్శించే ధైర్యం, ముందుచూపును ఈ చిత్రం చాటిచెబుతుంది. ఒక ఉగ్రవాద దాడి మధ్యలో, పిల్లలతో సహా ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడటానికి నర్సులు తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టారో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇందులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో, ‘భారత్ భాగ్య విధాత’పై విస్తృత చర్చ జరుగుతోంది. తరచుగా, థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందని చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా మాత్రం సత్తా చాటుతుంటాయి. ప్రస్తుతం కంగనా చిత్రం విషయంలోనూ ఇలాగే జరుగుతోంది.
ఇదిలా ఉండగా, ‘భారత్ భాగ్య విధాత’ తర్వాత కంగనా రనౌత్ ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని నివేదికల ప్రకారం
ఆమె ‘సర్కిల్’, ‘క్వీన్ 2’ చిత్రాలలో నటించనుందని తెలుస్తోంది. ‘క్వీన్ 2’ అనేది 2014లో విజయవంతమైన ‘క్వీన్’ చిత్రానికి సీక్వెల్. త్వరలోనే వీటిపై అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.