
హారర్ సినిమాలు, మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు గుడ్ న్యూస్. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన అద్భుత్ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. విడుదల విషయంలో విభిన్నంగా వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరిస్తోంది. సాధారణంగా సినిమాలు ముందుగా థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ అద్భుత్ మాత్రం తొలుత టీవీ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అనంతరం ఓటీటీ బాట పట్టింది. మరి ఈ సినిమాలో ఏముంది? కథ ఎలా సాగుతుంది.? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది.?
బాలీవుడ్‌లో హీరోపంతి, బాఘి, మున్నా మైఖేల్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సబ్బీర్ ఖాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ సినిమాలకు భిన్నంగా.. అతీంద్రియ శక్తులు, అనుమానాస్పద ఘటనలు, మానసిక సంఘర్షణల చుట్టూ తిరిగే కథ ఈ సినిమా.. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు డయానా పెంటీ, శ్రేయా ధన్వంతరి, రోహన్ మెహ్రా కీలక పాత్రల్లో నటించారు. 2024లో సోనీ మ్యాక్స్‌లో టీవీ ప్రీమియర్‌గా ప్రసారమైన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే.. ప్రైవేట్ డిటెక్టివ్ గజరాజ్ అవస్థి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపిస్తారు. తన వృత్తి జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన కేసును గుర్తుచేసుకోవడంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఐదేళ్ల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా కొండ ప్రాంతంలో చోటుచేసుకున్న కొన్ని విచిత్రమైన ఘటనలు అతడి కలలోకి వస్తాయి. డాక్టర్ ఆదిత్య రావత్ (రోహన్ మెహ్రా), అతడి భార్య డాక్టర్ శ్రుతి రావత్ (శ్రేయా ధన్వంతరి) కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాల్లో ఊహించని పరిణామాలు మొదలవుతాయి. ఇప్పటికే తీవ్రమైన డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్న శ్రుతికి అక్కడ ఎదురవుతున్న వింత అనుభవాలు మరింత భయాన్ని కలిగిస్తాయి. ఇంట్లో కనిపించని శక్తి ఏదో తమను వెంటాడుతోందనే అనుమానం ఆ దంపతుల్లో పెరుగుతుంది. మొదట చిన్నవిగా కనిపించిన ఘటనలు క్రమంగా ప్రమాదకరంగా మారడంతో వారు డిటెక్టివ్ గజరాజ్ అవస్థిని సంప్రదిస్తారు. కేసును స్వీకరించిన అతడు విచారణ మొదలుపెడతాడు. ఆదిత్య, శ్రుతి పాల్గొన్న ఓ ఆసుపత్రి వేడుకలో అనూహ్యమైన ప్రమాదం చోటుచేసుకుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్న గజరాజ్‌కు మేరీ మ్యాథ్యూస్ అనే మహిళ కనిపిస్తుంది. ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా సరైన సమాచారం దొరకదు. ఆమె గతం, గుర్తింపు, ఆచూకీ అన్నీ మిస్టరీగానే మిగిలిపోతాయి.
దీంతో గజరాజ్ విచారణ మరింత లోతుగా సాగుతుంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో గతంలో జరిగిన ఓ అనుమానాస్పద ఘటన వెలుగులోకి వస్తుంది. కోమాలో ఉన్న అమీ ఆర్. మ్యాథ్యూస్ అనే రోగి మరణానికి డాక్టర్ ఆదిత్య, శ్రుతికి సంబంధం ఉందనే విషయం బయటపడుతుంది.
అయితే, ఆ పాత ఘటనకు ప్రస్తుతం జరుగుతున్న భయానక పరిణామాలకు సంబంధం ఏమిటి? మేరీ మ్యాథ్యూస్ ఎవరు? ఆమె వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ సంఘటనలన్నీ నిజంగా అతీంద్రియ శక్తుల వల్లే జరుగుతున్నాయా? లేక వీటి వెనుక మరో కారణం ఉందా? అనే ప్రశ్నల చుట్టూ కథ ఉత్కంఠగా సాగుతుంది. ఈ మిస్టరీకి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అద్భుత్ సినిమా జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్, సస్పెన్స్, మిస్టరీ కథాంశాలతో కూడిన సినిమాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తమ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.