
ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్న కథాంశాలతో తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా హారర్, సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే చిత్రాలు ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేస్తుంటాయి. ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కథ సాగితే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. దాని గురించి చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే స్ప్లైస్. 2009లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్కు విన్సెంజో నటాలి దర్శకత్వం వహించారు. అడ్రియన్ బ్రాడీ, సారా పోలీ ప్రధాన పాత్రల్లో నటించారు. జన్యు శాస్త్ర ప్రయోగాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. మనుషులు ప్రకృతి నియమాలను అతిక్రమిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశం పై ఈ సినిమా కథ సాగుతుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎల్సా, క్లైవ్ అనే ఇద్దరు ప్రతిభావంతులైన జన్యు శాస్త్రవేత్తలు ఓ బయోటెక్నాలజీ సంస్థలో పనిచేస్తుంటారు. వివిధ జీవుల డీఎన్ఏలను కలిపి, వైద్య పరిశోధనలకు ఉపయోగపడే కొత్త జీవులను సృష్టించడం వారి పని. ఈ ప్రయోగాల్లో కొంతవరకు విజయం సాధించిన వీరిద్దరూ.. మరో సాహసోపేతమైన అడుగు వేయాలని నిర్ణయించుకుంటారు. జంతువుల జన్యువులతో పాటు మానవ డీఎన్ఏను కూడా ఉపయోగించి సరికొత్త జీవిని సృష్టించాలనుకుంటారు. అయితే, ఇలాంటి ప్రయోగాలకు సంస్థ అనుమతి ఇవ్వదు. అయినప్పటికీ ఎల్సా, క్లైవ్ రహస్యంగా తమ పరిశోధనను కొనసాగిస్తారు. చివరకు వారి ప్రయోగం ద్వారా ఊహించని లక్షణాలున్న ఓ వింత జీవి జన్మిస్తుంది. దానికి ‘డ్రెన్’ అని పేరు పెడతారు. ప్రారంభంలో చిన్న జీవిగా కనిపించే డ్రెన్.. అనూహ్యమైన వేగంతో పెరుగుతూ, అసాధారణ సామర్థ్యాలను చూపిస్తుంది. అయితే దాని ఎదుగుదలతో పాటు సమస్యలు కూడా మొదలవుతాయి. డ్రెన్లోని మానవ లక్షణాలు, దాని ప్రవర్తనలో వచ్చే మార్పులు ఎల్సా, క్లైవ్లను ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
మరోవైపు, ఈ ప్రయోగంలో ఉపయోగించిన మానవ జన్యు పదార్థం వెనుక ఉన్న నిజాలు బయటపడటంతో పరిస్థితులు మరింత డేంజర్ గా మారతాయి. డ్రెన్ ఎదుగుతున్న కొద్దీ దాని స్వభావం కూడా మారుతుంది. ముఖ్యంగా అది మరో రూపంలోకి మారడం కథను కీలక మలుపు తిప్పుతుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు ఎల్సా, క్లైవ్ల జీవితాలను ప్రమాదంలోకి నెడతాయి. తాము సృష్టించిన జీవిని నియంత్రించగలమని భావించిన శాస్త్రవేత్తలకు చివరకు ఎదురయ్యే పరిస్థితులు ఏమిటన్నదే ఈ సినిమా కథ. ప్రయోగం అదుపు తప్పిన తర్వాత డ్రెన్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. దాన్ని నియంత్రించేందుకు ఎల్సా, క్లైవ్ చేసే ప్రయత్నాలు కొత్త సమస్యలకు దారితీస్తాయి. చివరికి ఆ జీవి నుంచి వారు బయటపడగలిగారా? తమ ప్రయోగానికి తామే బలయ్యారా? అన్నది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయి. ఓ క్రమంలో డ్రెన్ కి లైంగిక ఆకర్షణ పెరుగుతుంది. ఆతర్వాత వివాదాస్పద సన్నివేశానికి దారితీస్తుంది. డ్రెన్ ఆడ రూపం నుంచి మగరూపంలోకి మారిపోతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..