AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar 2 Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. సీక్వెల్‌తో కార్తి మెప్పించారా..?

కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా సర్దార్ 2 సెప్టెంబర్ 10, 2026న విడుదలైంది. సూపర్ హిట్ సినిమా సర్దార్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Sardar 2 Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. సీక్వెల్‌తో కార్తి మెప్పించారా..?
Sardar 2 Movie Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 10, 2026 | 1:07 PM

Share

మూవీ రివ్యూ: సర్దార్ 2

నటీనటులు: కార్తి, ఎస్.జె.సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్ తదితరులు

సంగీతం: శ్యామ్ సి.ఎస్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

నిర్మాతలు: ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఎస్. మిత్రన్

కథ:

తన తండ్రి సర్దార్ (కార్తీ) ఇక లేడని నమ్మిన విజయ్ (కార్తీ).. తన ఉద్యోగంపై పూర్తిగా దృష్టి పెడతాడు. ‘రా’ ఏజెంట్‌గా పనిచేసే విజయ్‌పై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకుని, పెద్దగా గుర్తింపు లేని చోట పనిష్మెంట్ పోస్టింగ్ ఇస్తారు. అయినా నిరాశపడకుండా అక్కడ తన సత్తా నిరూపించుకుని తిరిగి మంచి హోదా దక్కించుకోవాలని అతను పోరాడుతుంటాడు. అయితే ఓ ఏజెంట్ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో విజయ్ మళ్లీ ‘రా’ ఉన్నతాధికారుల ఎదుట విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ దర్యాప్తులో అతనికి ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడతాయి. ముఖ్యంగా బ్లాక్ డాగర్ సూర్య తన గ్యాంగ్‌తో కలిసి ఒక భారీ కుట్రకు తెరలేపాడని గ్రహించి, వాళ్ళ ప్లాన్ ఏంటో కనిపెట్టే పనిలో పడతాడు. ఆ ప్రయాణంలోనే తన తండ్రి సర్దార్‌కి సంబంధించిన పలు సంచలన విషయాలు కూడా విజయ్‌కు తెలుస్తాయి. ఇంతకీ ఈ ‘బ్లాక్ డాగర్’ ఎవరు? అతను ‘రా’ ఏజెంట్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? విజయ్ ఈ ప్రమాదకరమైన మిషన్‌ను ఎలా అడ్డుకున్నాడు? అసలు ‘మిషన్ డోకు’ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

కథనం:

సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ఏజెంట్ వాల్రస్ అన్వేషణతో మొదలై ‘మిషన్ డోకు’ వైపు వెళ్లే ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తుంది. అయితే కొన్ని యాక్షన్ సీన్స్, ముఖ్యంగా జపాన్ నేపథ్యంలో విమానాల్లోంచి దూకుతూ గాలిలో చేసే విన్యాసాలు లాజిక్‌కు కాస్త దూరంగా అనిపించినా.. వాటిని చాలా భారీ స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ అంతా హైప్ పెంచడానికి రాసుకున్నాడు. ఓ మిషన్ చుట్టూ తిరగడం, అదేంటని చెప్పకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ ఇంటర్వెల్ వరకు తీసుకొచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలన్నీ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో అంతగా ఆకట్టుకోలేదు దర్శకుడు మిత్రన్. సర్దార్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి కలిగే నష్టాల గురించి చెప్పినట్లే.. ఇందులో కృత్రిమ మాంసాహారం, శరీరానికి మందులు విపరీతం అలవాటు చేస్తున్న విధానం గురించి చూపించారు. అయితే ఫస్ట్ పార్ట్ చూసి చాలా ఏళ్లవడంతో కాస్త కన్ప్యూజన్స్ కూడా వస్తుంటాయి. మొదటి భాగానికి లింక్ పెడుతూ రాసుకున్న సన్నివేశాలు మళ్లీ గుర్తు చేసుకోవడం కష్టం. ఫస్టాఫ్ వరకు బాగానే అనిపించినా.. సెకండాఫ్‌లో మాత్రం బాగా స్లో అయిపోయింది కథనం. ఒక పజిల్ గేమ్ లాగా సాగుతుంది. విలన్ హీరోను ఒక్కో అంతస్తుకు పంపుతూ కొత్త సవాళ్లు విసరడం అనే కాన్సెప్ట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ తెరపై చూసేటప్పుడు ఆ ప్రాసెస్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. చివర్లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. స్క్రీన్‌ప్లేలో నిడివి కొంచెం తగ్గించి, ఎమోషన్స్‌ను ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ స్పై థ్రిల్లర్ రేంజ్ మరింత పెరిగి ఉండేది. ఫస్ట్ పార్ట్ చూసినపుడు కలిగే ఫీలింగ్ అయితే సెకండ్ పార్ట్‌కు మిస్ చేసారనే చెప్పాలి.

నటీనటులు:

తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో కార్తి తనదైన శైలిలో చాలా చక్కటి నటన కనబరిచాడు. తన యాక్టింగ్‌తో సినిమాను భుజాలపై మోస్తూ ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా చూసుకున్నాడు. విలన్‌గా ఎస్.జె.సూర్య ఎప్పటిలాగే తనదైన మార్క్ యాటిట్యూడ్‌తో సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. మాళవిక మోహనన్ యాక్షన్ సన్నివేశాల్లో తనవంతుగా బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆషికా రంగనాథ్, రజిషా విజయన్, యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు.

టెక్నికల్ టీం:

శ్యామ్ సి.ఎస్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేసింది. సినిమాలో పాటలు లేకపోవడం వల్ల కథ వేగంగా ముందుకు వెళ్లడానికి అవకాశం దొరికింది. జార్జ్ సి విలియమ్స్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది, కొన్ని భారీ యాక్షన్ లొకేషన్లను చాలా గ్రాండ్‌గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ విభాగం సెకండాఫ్‌లో కాస్త కత్తెరకు పనిచెప్పి, సాగదీత సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా చాలా రిచ్‌గా ఉన్నాయి, కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్‌పుట్ ఇంకా అద్భుతంగా వచ్చేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సర్దార్ 2.. యావరేజ్ స్పై థ్రిల్లర్..!

Follow Us