AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Chidambaram Garu Review: శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ.. ప్రశాంతమైన కొత్త ప్రయత్నం..!

సినిమాల్లో కళ్లద్దాలు కేవలం స్టైల్ కోసమే కాకుండా, ఒక్కోసారి పాత్ర స్వభావానికి ప్రతీకగా కూడా వాడుతుంటారు. పదేళ్ళ కింద వచ్చిన ఎవడే సుబ్రమణ్యంలో హోదా కోసం, ఈ నగరానికి ఏమైందిలో బాధను దాచుకోవడం కోసం హీరోలు అద్దాలను వాడారు. అదే కోవలో తన శారీరక లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నల్ల కళ్ళద్దాలను ఆశ్రయించిన ఒక యువకుడి కథే శ్రీ చిదంబరం గారు. నూతన దర్శకుడు వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ చిత్రం.. ఆ అద్దాలను తీసేసి తనను తాను ఎలా ప్రేమించుకున్నాడనే ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది.. మరి అదెలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Sri Chidambaram Garu Review: శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ.. ప్రశాంతమైన కొత్త ప్రయత్నం..!
Sri Chidambaram Garu
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 3:05 PM

Share

మూవీ రివ్యూ: శ్రీ చిదంబరం గారు

నటీనటులు: వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ, గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత, అరుణ్ కుమార్, నాయుడు మోరమ్ తదితరులు

ఎడిటింగ్: అన్వర్ అలీ

సంగీతం: చందు రవి

సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్ పొడిశెట్టి

దర్శకత్వం: వినయ్ రత్నం

నిర్మాతలు: చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి

కథ:

సాల్మన్ (వంశీ తుమ్మల) రాజమండ్రి పరిసరాల్లోని ఒక పల్లెటూరి యువకుడు. అతనికి పుట్టుకతోనే మెల్లకన్ను ఉండటంతో, ఊరి జనం అతన్ని ఎగతాళిగా చిదంబరం అని పిలుస్తుంటారు. చిన్నప్పుడే జరిగిన ఒక విషాదం కారణంగా చదువు మానేసి, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. తన మెల్లకన్నును చూసి అందరూ నవ్వుతారని భయపడుతూ, తీవ్రమైన ఇన్ సెక్యూరిటీతో నల్ల కళ్లద్దాల వెనుక దాక్కుంటాడు. ఇలాంటి సమయంలో సాల్మన్ చిన్ననాటి స్నేహితురాలు లీల (సంధ్య వశిష్ఠ) అతని జీవితంలోకి వస్తుంది. ఆమె చొరవతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే తన ప్రేమను చెప్పినపుడు.. నిన్ను నువ్వు ప్రేమించుకోలేని వాడివి.. నన్ను ఎలా ప్రేమిస్తావు? అని లీల అడిగిన ఒకే ఒక్క ప్రశ్న సాల్మన్ గుండెల్లో గుచ్చుకుంటుంది. ఆ తర్వాత సాల్మన్ తన భయాలను జయించి, తన అస్తిత్వాన్ని ఎలా వెతుక్కున్నాడు? సమాజం చేసే హేళనలను ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే మిగతా కథ.

కథనం:

దర్శకుడు వినయ్ రత్నం ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదే అయినా.. దాన్ని చెప్పిన విధానం చాలా నిజాయితీగా ఉంది. సాధారణంగా సినిమాల్లో గ్రామీణ క్రైస్తవ కుటుంబాలను కామెడీ కోసం వాడుతుంటారు. కానీ ఇందులో ఆ కమ్యూనిటీ జీవనశైలిని, వారి ఆచారాలను చాలా సహజంగా, గౌరవప్రదంగా చూపించడం విశేషం. ఇది ఒక ఆత్మశోధన అంటే మనిషి తనను తాను తెలుసుకోవడం చుట్టూ తిరిగే కథ. కాకపోతే చిదంబరంలో ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటి.. కథ. కథనం చాలా నెమ్మదిగా సాగడం..! హీరో తన లోపంతో సతమతమయ్యే సన్నివేశాలు, తల్లితో, లీలతో గడిపే క్షణాల చుట్టూనే ఎక్కువ సమయం కేటాయించారు. కథలో పెద్ద మలుపులు లేకపోవడం వల్ల కొన్నిచోట్ల సాగదీసిన భావన కలుగుతుంది. అయితే రాజమండ్రి గోదావరి తీరం, పొగమంచుతో నిండిన ఉదయాలు, అక్కడి వాతావరణం ఆ నెమ్మదితనాన్ని మరిపిస్తాయి. హీరో అంతర్మధనాన్ని మౌనంగా చూపించాల్సిన చోట.. దర్శకుడు డైలాగుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. దీనివల్ల కొన్ని సన్నివేశాలు మరీ క్లాస్ పీకినట్టుగా అనిపిస్తాయి. కానీ, క్లైమాక్స్‌లో వచ్చే మార్పు, హీరో తన తండ్రి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న సంఘర్షణ సినిమాకు బలం చేకూర్చాయి. లోపాలు మనల్ని తక్కువ చేయకూడదు అనే పాయింట్‌ను చివర్లో కన్విన్సింగ్‌గా చెప్పారు.

నటీనటులు:

ఈ సినిమాకి ప్రధాన బలం ప్రధాన నటీనటులే. సాల్మన్ పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. భయం, ఆత్మన్యూనత, ప్రేమ కోసం తపన పడే యువకుడిగా అతని నటన చాలా సహజంగా ఉంది. ఇక లీలగా నటించిన సంధ్య వశిష్ఠ సినిమాకు వెన్నెముక లాంటిది. ఒకవైపు ప్రేమిస్తూనే, మరోవైపు ప్రియుడికి దారి చూపే దృఢమైన అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్ల మదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఊరి జనం నోళ్లు మూయించే సందర్భాల్లో వారి నటన బాగుంది. హీరో ఫ్రెండ్ అనిల్ పాత్ర పర్వాలేదనిపిస్తుంది.

టెక్నికల్ టీం:

చందు రవి అందించిన పాటలు బాగున్నాయి.. నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగ్గట్టుగా సాగుతుంది. ఈ సినిమాను ఒక విజువల్ పొయెట్రీలా మలిచాడు సినిమాటోగ్రాఫర్ అక్షయ్ రామ్ పొడిశెట్టి. పల్లెటూరి అందాలను, ముఖ్యంగా సూర్యాస్తమయాలు, నదీ తీరాలను కెమెరాలో బంధించిన తీరు అద్భుతం. వినయ్ రత్నం రచనలో నిజాయితీ ఉంది కానీ, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది. ఎడిటింగ్ విషయంలో అక్కడక్కడా కత్తెరకు పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథకు తగినట్టుగా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా శ్రీ చిదంబరం గారు.. ఆత్మగౌరవం కోసం పోరాడే ఒక సామాన్యుడి కథ..