Cinema : క్లాసికల్ సినిమా ఆడదు అని ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. థియేటర్లకు క్యూ కట్టిన జనాలు..

కల్ట్ క్లాసిక్‌గా పేరుగాంచిన శంకరాభరణం సినిమా నిర్మాణం సులభంగా జరగలేదని నటుడు ఎడిద శ్రీరామ్ వెల్లడించారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవ్వడం, పంపిణీదారులు లేకపోవడం వంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. చివరకు అనూహ్య విజయంతో శాస్త్రీయ సంగీత, నృత్య కళలకు జీవం పోసి, సాంస్కృతిక విప్లవానికి నాంది పలికింది.

Cinema : క్లాసికల్ సినిమా ఆడదు అని ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. థియేటర్లకు క్యూ కట్టిన జనాలు..
Sankarabharanam

Updated on: Oct 12, 2026 | 9:27 PM

శంకరాభరణం సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. కల్ట్ క్లాసిక్‌గా, అజరామర చిత్రంగా నేటికీ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయింది. అయితే, ఈ అద్భుత చిత్రం నిర్మాణం వెనుక కష్టాలు, సవాళ్లు కూడా ఉన్నాయని నటుడు ఎడిద శ్రీరామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, శంకరాభరణం షూటింగ్ అనుకున్నంత సులభంగా సాగలేదు. బడ్జెట్ విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో రూ.12 లక్షలు బడ్జెట్‌తో నిర్మితమైన ఈ కలర్ సినిమా, అనుకున్న దానికంటే చాలా ఎక్కువైందని, ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద రిస్క్ అని శ్రీరామ్ తెలిపారు. సినిమా పూర్తయిన తర్వాత వ్యాపారం దాదాపు సున్నా అట. పంపిణీదారులు ఎవరూ లేకపోవడం, కమీషన్ పద్ధతిలో విడుదల చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో చిత్ర బృందం తీవ్ర నిరాశకు గురైంది. పలువురు పంపిణీదారులకు ప్రదర్శించినా, “క్లాసికల్ సినిమా ఆడదు” అంటూ తిరస్కరించినట్లు శ్రీరామ్ చెప్పారు. అయితే, ఎం.ఎస్. రెడ్డి (నెల్లూరు), కె.ఆర్. ప్రభు (కర్ణాటక), లక్ష్మి ఫిలిమ్స్ లింగమూర్తి వంటి కొందరు నమ్మి ముందుకు వచ్చి పంపిణీ హక్కులు తీసుకున్నారని ఆయన వివరించారు.

నిర్మాత ఎడిద నాగేశ్వరరావు అచంచలమైన నమ్మకం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణమని శ్రీరామ్ పేర్కొన్నారు. ఒక సందర్భంలో కె. విశ్వనాథ్ గారు కూడా “నేను అనవసరంగా మీతో చేయించానా?” అని బాధపడ్డారట. కానీ, నాగేశ్వరరావు గారు “లేదు, నమ్మకం ఉంది, అవుతుంది” అని ధైర్యం చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. విడుదలైన మొదటి రోజు థియేటర్లలో (హైదరాబాద్‌లో) పది మంది, ఇరవై మంది కూడా లేకపోవడంతో చిత్ర బృందం నిరాశకు గురైంది. కానీ, సాయంత్రానికి కాస్త పాజిటివ్ టాక్ రావడంతో, అక్కడి నుంచి సినిమా “వైల్డ్‌ఫైర్” లాగా వ్యాపించి, ఒక వారంలోనే సంచలనంగా మారిందని శ్రీరామ్ వివరించారు. శంకరాభరణం కేవలం ఒక సినిమాగానే కాకుండా, సమాజంపై అపారమైన ప్రభావాన్ని చూపింది. ఇది శాస్త్రీయ సంగీతానికి కొత్త జీవం పోసింది. సంగీత మాస్టర్లు తమ వద్దకు విద్యార్థులు వచ్చి “సంగీతం నేర్పమని” అడగడంతో, పాత వాయిద్యాలపై పేరుకుపోయిన దుమ్ము దులిపి తిరిగి తరగతులు ప్రారంభించారని, సంతోషంగా ఉన్నామని వాళ్లందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఏర్పడి విశ్వనాథ్ గారిని సన్మానించారని శ్రీరామ్ గుర్తు చేసుకున్నారు. అలాగే, సాగర సంగమం తర్వాత ఆడవాళ్లు మాత్రమే నేర్చుకునే శాస్త్రీయ నృత్యాలకు మగవాళ్లు కూడా క్యూ కట్టడం ప్రారంభించారని ఆయన తెలిపారు.

ఈ సినిమా అంతర్జాతీయంగా కూడా అద్భుత విజయాలు సాధించింది. అమెరికాలో 35ఎంఎం థియేటర్లలో విడుదలైన మొదటి తెలుగు సినిమా శంకరాభరణం. అంతకుముందు 16ఎంఎం రీళ్లు బాంక్వెట్ హాల్స్‌లో ప్రదర్శించేవారు. దండమూడి రామ్మోహన్ రావు గారు యూఎస్ హక్కులు కొని, బాలసుబ్రహ్మణ్యం, కె. విశ్వనాథ్, ఎడిద నాగేశ్వరరావు, మహదేవన్, సోమయాజులు, మంజు భార్గవి వంటి వారందరితో కలిసి “శంకరాభరణం నైట్స్” పేరుతో ప్రదర్శనలు నిర్వహించారు. అక్కడ వారికి గొప్ప సన్మానాలు, గండపెండేరాలు, బహుమతులు లభించాయి. తమిళనాడులో సౌందరరాజన్, మనోరమ వంటి ప్రముఖులు హక్కులు కొని, అక్కడ నాలుగు థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించి ప్రభంజనం సృష్టించారు. మలయాళంలో ఏవీఎం వారికి చెందిన ఒక ధనవంతుడు, అప్పటికే నష్టాల్లో ఉండి ఇది చివరి అవకాశం అని భావించి హక్కులు తీసుకుని విడుదల చేశారట. అక్కడ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us