సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన కుర్రాడు అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ గురిచేసింది. అప్పటివరకు సరదాగా కనిపించిన సుశాంత్ అంతలోనే సూసైడ్ చేసుకోడం జీర్ణించుకోలేకపోయారు . ఈ హీరో మరణించి ఇప్పటికీ మూడేళ్లు అవుతున్నా ఇంకా అతని ఆత్మహత్యపై సందిగ్ధత వీడడం లేదు. అధికారులు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయంటున్నప్పటికీ.. అతని అభిమానులు, కుటుంబసభ్యులు మాత్రం ఆయన మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన మరణపై సీబీఐ విచారణ చేపట్టింది. మూడేళ్లుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుశాంత్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల విచారణలో బలమైన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు.
దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. “మొదట ఈ కేసులో కొందరు చెప్పిన సమాచారం మాత్రమే ఉంది. ఆ తర్వాత కొందరు తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాము. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. వాటి విశ్వసనీయతను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నందున ఇప్పుడు దీని గురించి ఇంతకంటే ఏం మాట్లాడలేను” అన్నారు.
2020 జూన్ లో సుశాంత్ ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించారు. అయితే ముందుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంతా అనుకున్నారు.. కానీ సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. కుట్ర కోణం ఉందని కుటుంబసభ్యులతోపాటు, అభిమానులు ఆరోపించడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సుశాంత్ సింగ్ చివరిసారిగా నటించిన చిత్రం దిల్ బెచారే.