కంచి పట్టు లెహంగాలో అదితి రావు హైదరి ‘రాయల్’ లుక్! కాంచీపురం సిల్క్ ప్రత్యేకత తెలుసా

ఫ్యాషన్ అంటే కేవలం మోడ్రన్​ దుస్తులు మాత్రమే కాదు, కొన్ని సార్లు సరైన రంగులు, సరైన కళాకృతులు కలిస్తే వచ్చే అందమే వేరు. అదితి రావు హైదరి ధరించిన లైమ్-ఎల్లో సిల్క్ లెహంగా, ముదురు ఊదా రంగుబ్లౌజ్ కాంబినేషన్ దీనికి నిదర్శనం.

కంచి పట్టు లెహంగాలో అదితి రావు హైదరి ‘రాయల్’ లుక్! కాంచీపురం సిల్క్ ప్రత్యేకత తెలుసా
Aditi Rao12

Updated on: Mar 24, 2026 | 8:14 AM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి అదితి రావు హైదరి, ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ‘రాయల్ లుక్’కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. ఇటీవల ప్రముఖ డిజైనర్ గౌరంగ్ షా రూపొందించిన కాంచీపురం లెహంగాలో ఆమె మెరిసిపోయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడంబరం కంటే హుందాతనానికే పెద్దపీట వేసే అదితి, ఈ ట్రెడిషనల్ లుక్‌లో భారతీయ చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

కాంచీపురం పట్టు..

తమిళనాడులోని కాంచీపురం పట్టణం ఈ పట్టు వస్త్రాలకు పుట్టినిల్లు. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చేనేత కళలో ప్రతి వస్త్రాన్ని స్వచ్ఛమైన మల్బరీ పట్టు దారాలతో నేస్తారు. కాంచీపురం చీరలు లేదా లెహంగాలు నేసేటప్పుడు బోర్డర్, బాడీని విడివిడిగా నేసి, తర్వాత వాటిని ‘ఇంటర్ లాక్’ చేస్తారు. ఇవి ఎంత బలంగా ఉంటాయంటే ఎప్పటికీ విడిపోవు. బంగారం, వెండి పూత పూసిన జరీ దారాలను ఇందులో వాడతారు. ఈ వస్త్రాలపై కనిపించే డిజైన్లు దేవాలయాలు, ప్రకృతి మరియు పురాణాల నుండి ప్రేరణ పొందినవి. అదితి ధరించిన లెహంగాపై ఉన్న బంగారు జరీ అంచు ఆమెకు ఒక రాజసం తెచ్చిపెట్టింది.

సంప్రదాయం ఉట్టిపడేలా..

అదితి తన డ్రెస్సును హైలైట్ చేయడానికి మేకప్ మరియు జ్యువెలరీని చాలా సింపుల్‌గా ఉంచుకున్నారు. మెడలో బంగారు టెంపుల్ స్టైల్ చోకర్, దానికి తగ్గట్టుగా జుమ్కాలు ధరించి పక్కా సంప్రదాయబద్ధంగా కనిపించారు. సాఫ్ట్ మేకప్, చిన్న బిందీతో ఆమె అందం మరింత రెట్టింపయింది. అతిగా లేకుండా అద్భుతంగా కనిపించడం ఆమె ప్రత్యేకత. కేవలం సంప్రదాయ దుస్తుల్లోనే కాదు, వెస్ట్రన్ వేర్‌లోనూ అదితి తన మార్కును చూపిస్తారు.

మెల్‌బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె ధరించిన ‘మోచా సూట్’ ఇందుకు ఉదాహరణ. స్ట్రక్చర్డ్ బ్లేజర్, గోల్డ్ బటన్స్, ప్లాజో ట్రౌజర్స్‌తో అప్పట్లో ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. మినిమలిజం మరియు ఫ్యాషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో అదితి తర్వాతే ఎవరైనా!

భారతీయ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని గౌరవిస్తూ, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో అదితి ఎప్పుడూ ముందుంటారు. ఆమె ధరించిన ఈ కంచి పట్టు లెహంగా పండుగల సీజన్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం ఖాయం.

Follow Us