
తెలుగు సినీ చరిత్రలో అలనాటి అందాల నటిగా సుపరిచితురాలైన ఆమని, ఇప్పటికీ అదే సౌందర్యం, గ్లామర్‌ను ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఆమె ప్రత్యేకమైన లేదా కఠినమైన డైట్ ప్లాన్‌లను అనుసరించరని, బదులుగా రోజువారీ ఆహారాన్ని సమయపాలనతో, పరిమిత పరిమాణంలో తీసుకోవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతారని వివరించారు. ఆమని ఉదయం లేవగానే వేడి నీటితో తన దినచర్యను ప్రారంభిస్తారు. గత 15 సంవత్సరాలుగా ఈ అలవాటును కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడి నీళ్లు ఆరోగ్యానికి మంచివని, జీర్ణక్రియకు సహాయపడతాయని ఆమె నమ్మకం. వేడి నీళ్లు తాగిన అరగంట తర్వాత, ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుంటారు. ఇది గొంతును ఆరోగ్యంగా ఉంచుతుందని, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత టీ తాగనిదే మైండ్ సెట్ కాదని చెబుతూ, తాను టీ లవర్ అని వెల్లడించారు. టీ అయ్యాక, ఒక గంట తర్వాత అల్పాహారం తీసుకుంటారు.
ఆమని అల్పాహారంలో ఇడ్లీ, దోశ, పూరీ, చపాతీ, వడ వంటి అన్ని రకాల టిఫిన్లను తింటానని చెప్పారు. అయితే, ఇవన్నీ చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే తీసుకుంటారు. ఉదాహరణకు, మూడు ఇడ్లీలు, లేదా ఒకటిన్నర నుండి రెండు దోశలు, రెండు పూరీలకు మించి తినరు. మధ్యాహ్న సమయానికి, ఒక గ్లాసు మజ్జిగ లేదా వెజిటబుల్ సూప్‌లను తాగుతారు. క్యారెట్, స్వీట్ కార్న్ వంటి వాటితో చేసిన సూప్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. పండ్లు తినడానికి అంతగా ఇష్టపడనప్పటికీ, అప్పుడప్పుడు జామకాయ లేదా బొప్పాయి ముక్కలను తీసుకుంటారు. అప్పుడప్పుడు స్వీట్లు తినాలనిపించినా, వాటిని కూడా చాలా పరిమితంగానే తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో నాన్-వెజ్, వెజ్ రెండూ తింటానని ఆమని తెలిపారు. అయితే, అన్నీ పరిమిత పరిమాణంలోనే ఉంటాయి. అన్నం తక్కువగా తీసుకుని, పప్పు లేదా కూరలను ఎక్కువగా తీసుకుంటారు. తనకు ఏదైనా తినాలనిపిస్తే, అది ఎంత ఖరీదైనదైనా సరే, వెంటనే తినేస్తానని, కానీ ఎప్పుడూ పూర్తిగా కడుపు నిండా తిననని ఆమె వివరించారు. భోజనం చేసే సమయాలను క్రమం తప్పకుండా పాటించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆమె నొక్కి చెప్పారు. రాత్రి 12 లేదా 1 గంటల సమయంలో తినడం లాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, స్థూలకాయానికి దారితీస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో ఆమని మళ్లీ ఒక కప్పు టీ తాగుతారు. ఈ సమయంలో ఇంట్లో తయారుచేసిన మురుకులు, చెకోడీలు వంటి స్నాక్స్‌ను మాత్రమే తీసుకుంటారు. బయటి ఆహారం అంత ఆరోగ్యకరమైనది కాదని ఆమె నమ్మకం. రాత్రి భోజనం త్వరగా, సుమారు ఏడు గంటలకల్లా ముగిస్తారు. రాత్రిపూట అన్నం బదులు రెండు చపాతీలు, ఎక్కువ కూరతో తీసుకుంటారు. దొండకాయ, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలతో పాటు, తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర వంటి అన్ని రకాల ఆకుకూరలను తింటానని ఆమె చెప్పారు. ఆమని తన డైట్ ప్లాన్‌లో నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందని, చర్మం పొడిబారకుండా, గ్లోగా ఉంటుందని ఆమె తెలిపారు. నీరు శరీరానికి, ముఖ్యంగా చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆమె చెప్పారు. ఆమని బయటి ఆహారాన్ని చాలా అరుదుగా తింటారు. ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. షూటింగ్స్‌లో ఉన్నప్పుడు కూడా ఇంటి నుంచే క్యారేజ్ తీసుకెళ్తారని, బయటి ఆహారం తనకు సరిపడదని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమం తప్పని ఆహార అలవాట్లు తనను ఆరోగ్యంగా ఉంచుతున్నాయని, తన గ్లామర్‌కు కూడా సహాయపడుతున్నాయని ఆమని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..