మోగిన నగారా.. సూర్యపేట జిల్లాలో అమలులోకి ఎన్నికల కోడ్

Election code in suryapet ahead of huzurnagar bypoll says CEO, మోగిన నగారా.. సూర్యపేట జిల్లాలో అమలులోకి ఎన్నికల కోడ్

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు కూడా ఈసీ ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నట్లు సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణలోని హుజూర్‌నగర్‌ కూడా ఉంది. సుర్యపేట జిల్లాలోని ఖాళీయైన ఈ స్థానానికి అక్టోబర్‌ 21వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. అయితే హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో ఇవాళ్టి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. 2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే ఈ ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఏ విధానపరమైన ప్రకటనలు చేయరాదన్నారు. అంతేకాదు జిల్లాలో మంత్రులు ఎవ్వరూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. అదేవిధంగా జిల్లాకి సంబంధించిన ఏ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టరాదన్నారు. డబ్బు, మద్యం సరఫరాపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు అనిపిస్తే.. సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *