Family Suicide: కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకున్నాయి. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో సహా ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జరిగింది. కుటుంబ కలహాలతో ఎతిరాజు విజయ (25) అనే మహిళ ఇద్దరు పిల్లలు శ్రీకృష్ణ (3), కూతురు శ్రీకుర్తి (14 నెలలు) కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లల మృతదేహాలు నీటిలో పైకి తేలాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. విజయ మృతదేహం కోసం బావిలో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.