Pregnant woman forcibly aborted: తల్లిదండ్రులు వద్దని వారించినప్పటికీ.. ఆమె ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెపై కుటుంబసభ్యులు ప్రతీకారం తీర్చుకున్నారు. వద్దన్నా ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో తల్లి, సోదరి కలిసి ఆమె కడుపులోని బిడ్డను కర్కశంగా చంపారు. గర్భిణికి బలవంతంగా ఆపరేషన్ చేయించి బిడ్డను తొలగించిన అమానవీయ సంఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో వెలుగుచూసింది. అమంగల్ మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత (19), అదే గ్రామానికి చెందిన రవికుమార్ (23) ప్రేమించుకున్నారు. అయితే.. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. అయినప్పటికీ వారు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి. ఆమెకు విశ్రాంతి అవసరం కావటంతో రవికుమార్ ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచాడు. ఈ క్రమంలో సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం మాయమాటలు చెప్పి ఆసుపత్రిలో చూపిస్తామంటూ నమ్మించి ఆటోలో తీసుకెళ్లారు. అనంతరం బంధువులు చెప్పిన సమచారంతో భర్త రవికుమార్ ఆందోళన చెందాడు. ఏదైనా చేస్తారేమోనని అనుమానం వచ్చిన రవికుమార్ ఊర్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సునీత బంధువు ఒకరు కల్వకుర్తిలో నర్సుగా పనిచేస్తారు. అదే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో రవికుమార్ పోలీసులకు సమాచారమిచ్చాడు. అనంతరం పోలీసులు అక్కడికి వెళ్లగా సునీతకు ఆపరేషన్ చేసి బిడ్డను తొలగించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు బాధితురాలి తల్లిని, సోదరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. తల్లి, సోదరితోపాటు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు డా.శ్రీవాణి, ఇందుకు సహకరించిన నర్సుతోపాటు మరో ఆరుగురు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వైద్యురాలితోపాటు మిగతావారు పరారీలో ఉన్నారని.. వారికోసం దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Also Read: