CORONA VACCINATION: వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు చెక్.. ఆ దేశాల విజయ రహస్యమిదే!

|

Apr 14, 2021 | 3:32 PM

ప్రపంచ మానవాళిని కనీవినీ ఎరుగని రీతిలో గత ఏడాదిన్నర కాలంగా అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కి విరుగుడు లేదా అన్న సందేహాలను వ్యాక్సిన్లు...

CORONA VACCINATION: వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు చెక్.. ఆ దేశాల విజయ రహస్యమిదే!
Coronavirus
Follow us on

CORONA VACCINATION WEAPON TO ERADICATE CORONAVIRUS: ప్రపంచ మానవాళిని కనీవినీ ఎరుగని రీతిలో గత ఏడాదిన్నర కాలంగా అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌కి విరుగుడు లేదా అన్న సందేహాలను వ్యాక్సిన్లు పటాపంచలు చేసే సమయం ఆసన్నమైంది. నిజానికి ఏడాది క్రితం వరకు మనకు కరోనా వైరస్ గురించి పూర్తిగా తెలియదు. కరోనా సోకితే ఎలా గట్టెక్కాలా అన్న భయాందోళన సర్వత్రా వినిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలతోపాటు దానికి విరుగుడు కూడా కనుగొన్నారు. అయితే.. కరోనా వైరస్ సోకినా ప్రాణానికి పెద్ద ప్రమాదం లేదన్న నిర్లక్ష్యం ప్రజల్లో బాగా పెరిగిపోయింది. అందువల్లే ఆరు నెలల క్రితం కంట్రోల్ అయినట్లు కనిపించిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా సెకెండ్ వేవ్‌లో విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచంలో కరోనాతో అతిగా ఎఫెక్టయిన రెండో దేశంగా మన దేశం మారిపోయింది. ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండ్రోజులుగా అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకరోజు లక్షా 84 వేల కేసులు నమోదు కాగా.. ఆ మర్నాడే లక్షా 61 వేల కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. అయితే కరోనాను ఇక కంట్రోల్ చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయం మాత్రం తప్పని నిరూపిస్తున్నాయి కొన్ని దేశాలు.

టీకాలు అందుబాటులోకి రావడంతో కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. ఆ ఫలాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనంగా మన తీసుకోవచ్చు. గతంలో సార్స్‌, మెర్స్‌, డెంగీ వంటి వైరస్‌లకు సరైన వ్యాక్సిన్లను తయారు చేయలేకపోవడంతో కరోనా విషయంలో కూడా అదే పరిస్థితి తలెత్తుతుందని చాలామంది భయపడ్డారు. కానీ, నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆపరేషన్‌ రాప్‌ స్పీడ్‌ను ప్రారంభించారు. దీంతో మోడెర్నా, ఫైజర్ వంటి సంస్థలు అత్యంత వేగంగా ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా నడుం బిగించడంతో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు వేగవంతమయ్యాయి. చైనాలో కూడా ముందే మొదలుపెట్టినా.. ఆ దేశం తమ ప్రయోగాలను రహస్యంగా వుంచింది. మరే ఇతర దేశానికి తమ పురోగతిని తెలయకుండా నాటకాలు ఆడింది. ఇండియాలో భారత్‌ బయోటెక్‌ సంస్థ కూడా శరవేగంగా ప్రయోగాలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడా రాజీపడకుండా ఈ ప్రయోగాలకు సహకరించింది. అదే సమయంలో రష్యాలోని గమలేయ విశ్వవిద్యాలయం వ్యాక్సిన్ను తయారు చేసినట్లు ప్రకటించడంతో వ్యాక్సిన్ కనుగొనే రేసులో కీలక మలుపుగా మారింది. వివిధ దశల ప్రయోగ ఫలితాలను బహిర్గతం చేయలేదు. గమ్మత్తేంటంటే చైనా, రష్యా దేశాలు అనధికారికంగానే వ్యాక్సినేషన్‌ను మొదలుపెట్టాయి. మరోపక్క ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థ అమెరికాలో డిసెంబర్‌ 14న అత్యవసర అనుమతులు సాధించింది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు దేశాలు కూడా వ్యాక్సినేషన్‌ను శరవేగంగా మొదలు పెట్టాయి.

వ్యాక్సినేషన్‌ను ట్రాక్‌ చేస్తున్న ‘అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా’ ఏప్రిల్‌ 12వ తేదీన వెల్లడించిన గణాంకాల ప్రకారం పది లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్‌ అత్యధికంగా ప్రతి 100కి 118 డోస్‌లను (రెండు డోసులు లేదా షాట్‌లను కలిపితే ఒక టీకా లెక్కన) ఇచ్చింది. ఆ తర్వాత 91 డోసులతో యూఏఈ, 63 డోసులతో చిలీ, 59 డోసులతో యూకే, 55 డోసులతో బహ్రెయిన్‌, 55 డోసులతో అమెరికా, 42 డోసులతో సెర్బియా, 42 డోసులతో హంగేరీ,37 డోసులతో ఖతార్‌, 29 డోసులతో ఉరుగ్వేలు టాప్‌ టెన్‌ దేశాల జాబితాలో ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ ఫలాలు ఇజ్రాయెల్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జనవరి 20వ తేదీన 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినెషన్‌ మొదలైన తొలినాళ్లలో కేసుల తీవ్రత పెరగడంతో ఆ దేశం మరింత అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. ఏప్రిల్‌ 12 నాటికి దాదాపు 60శాతం మందికిపైగా వ్యాక్సిన్‌ డోస్ అందుకొన్నారు. ఆ దేశ జనాభా 90 లక్షలు. వీరిలో 8.30 లక్షల మందికి గతంలోనే కొవిడ్‌ సోకడంతో యాంటీబాడీలు లభించాయి. దాదాపు 53 లక్షల మందికి టీకాలు వేశారు. కొవిడ్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీకి 70 శాతం మందిలో యాంటీ బాడీలు ఉంటే చాలన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంది. ఫలితంగా ఏప్రిల్‌ 13 నాటికి అక్కడి రోజువారీ కేసుల సంఖ్య 200 లోపునకు పడిపోయింది.

వ్యాక్సినేషన్ విషయంలో ఇజ్రాయెల్‌ ముందు చూపును ఇపుడు ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి. ఆ దేశంలో డిసెంబర్‌ 19వ తేదీ నుంచే వ్యాక్సినేషన్‌ మొదలైంది. జనవరి 19 నాటికి అమెరికా ప్రజలు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహిస్తుంటే.. ఇజ్రాయెల్‌ మాత్రం 25 శాతం ప్రజలకు మొదటి డోసు వ్యాక్సిన్ వేసేసింది. మరో ఐదు లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసింది. వ్యాక్సిన్ల కొనుగోలు విషయంలో ఇజ్రాయెల్ దూకుడుగానే ఉంది. 2020 జూన్‌లోనే మోడెర్నా నుంచి వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందం చేసుకొంది. అదే ఏడాది నవంబర్‌లో అస్ట్రాజెనెకా, ఫైజర్లతో కూడా ఒప్పందం చేసుకొంది. ఇజ్రాయెల్‌ ప్రధాన విమానాశ్రయం వద్ద భూగర్భంలో 50 లక్షల డోసుల నిల్వ సామర్థ్యం ఉన్న 30 భారీ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేశారు.

మరోవైపు కొవిడ్‌ కల్లోలానికి గురైన యూకే కూడా మెల్లిగా ఊపిరి పీల్చుకుంటోంది. ఇక్కడ కూడా ఏప్రిల్‌ 11వ తేదీ నాటికి కొవిడ్‌ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకొన్న వారి శాతం 47కి పెరిగింది. దీంతో కేసులు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. యూకేలో జనవరి 8వ తేదీన అత్యధికంగా 68 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్య ఏప్రిల్‌ 13వ తేదీ నాటికి 2,472కి తగ్గిపోయింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కొవిడ్‌ ఆంక్షలను మెల్లిగా ఎత్తేస్తామని ఏప్రిల్‌ 5వ తేదీన ప్రకటించారు. ఇంకోవైపు అమెరికాలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా వ్యాక్సినేషన్‌ జరిగే కొద్దీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. జనవరి 8వ తేదీన 3 లక్షలకు పైగా కేసులు నమోదైన ఈ దేశంలో ఏప్రిల్‌ 13వ తేదీ నాటికి రోజువారీ కేసుల సంఖ్య 77 వేలకు తగ్గింది. అంకె పరంగా చూస్తే ఇది భారీగానే కనిపించవచ్చు.. కానీ, 2020 నవంబర్‌ రెండో వారం నుంచి 2021 జనవరి చివరి వరకు దాదాపు నిత్యం 1.50లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అందులో దాదాపు సగం మాత్రం రావడం అమెరికాకు కచ్చితంగా ఊరటనిచ్చే విషయమే. ఏప్రిల్‌12వ తేదీ నాటికి ఇక్కడ 36 శాతం మంది వ్యాక్సిన్లు వేయించుకొన్నారు.

మన దేశం విషయానికి వస్తే విపరీతమైన జనాభానే మనకు శాపంగా కనిపిస్తోంది. మన దేశంలో సుమారు 140 కోట్ల జనాభా వుంది. ఇంత మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేయాలంటే దానికి తగినట్లుగా భారీ ఎర్పాట్లు చేయాల్సి వుంటుంది. అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డేటా ప్రకారం మన దేశ జనాభాలో మాత్రం ఇప్పటి వరకు (ఏప్రిల్‌ 12 నాటికి) కేవలం 6.89 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ చేరింది. మనం హెర్డ్‌ ఇమ్యూనిటీ లక్ష్యానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అప్పటి వరకు మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతక దూరమే మనల్ని వైరస్‌ నుంచి రక్షిస్తాయి. జనవరి 16వ తేదీన మన దేశంలో వ్యాక్సినేషన్ మొదలైంది. తొలి విడతలో కరోనా వైరస్ నియంత్రణలో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు మాత్రమే వ్యాక్సిన్ అందించారు. ఆ తర్వాత మార్చి 1వ తేదీ నుంచి దేశంలో 60 ఏళ్ళు పైబడి వారందరికీ, 45 ఏళ్ళు నిండి దీర్ఘ కాలివ వ్యాధులున్న వారికి వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలైంది. అయితే.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన కోఆర్డినేషన్ కనిపించడం లేదు. దాంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మహారాష్ట్ర వంటి చోట్ల 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వృధా అయ్యాయంటే రాష్ట్రాల నిర్లక్ష్యం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవచ్చు.

తమ తమ రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన‌పై సరైన అవగాహన కల్పించి వుంటే ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొచ్చేవారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా వుంది. రాష్ట్రాలు అందించే వ్యాక్సిన్ ఇండెంట్లకు అనుగుణంగా తయారీ సంస్థలు ఉత్పత్తి పెంచి వుంటే ఈ పాటికి దేశంలో కనీసం 20 శాతానికైనా కరోనా వ్యాక్సిన్ అందేది. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వాల స్పందన వుండడంతో దేశంలో సెకెండ్ వేవ్ మరీ వేగంగా విస్తరిస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించడం వల్లనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వ్యాక్సినేషన్ ఉత్సవం పేరిట నాలుగు రోజుల పాటు కరోనా వ్యాక్సిన్లను వేగంగా పంపిణీ చేయాలని సూచించారు. అయితే.. ప్రధాని నిర్దేశించిన తేదీలలోగా దేశం చాలా రాష్ట్రాల్లో తగిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్లు లేవు. ఫలితంగా ఈ నాలుగు రోజుల ఉత్సవం కూడా పేలవంగానే కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం అప్పటి దాకా మాస్కులను మస్ట్‌గా ధరించడం, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. రెగ్యులర్‌గా శానిటైజర్లను వినియోగించడమే మన ముందున్న కర్తవ్యం.

ALSO READ: పిడుగుపాటును తప్పించుకోవచ్చా…? ఆసక్తికరమైన విషయాలు చదివితే షాకే !