
హైదరాబాద్, మే 22: తెలంగాణ పాలీసెట్ ఫలితాలు రేపు (శనివారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు మే 23లోపు రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 13న నిర్వహించగా మరుసటి రోజే అంటే మే 14న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేశారు. మే 16వ తేదీ వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించారు. తుది ఆన్సర్ కీ తయారు చేసిన సాంకేతిక విద్యాశాఖ ఈ మేరకు మే 23న పాలీసెట్ ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇక మే 27 నుంచి పాలీసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ మే 18న నిర్వహించిన సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది రెండు విడతలుగా కౌన్సెలింగ్ జరగపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన షెడ్యూల్‌ను విడుదల చేశారు. తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను జూన్ 6న కేటాయిస్తారు.