TG Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. హాల్ టికెట్ చూపిస్తే RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం!

ఇంటర్ పరీక్షలు 2026 బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు మొదలవుతాయి. విద్యార్ధులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. 5 నిమిషాలు గ్రేస్‌ టైం ఉంటుందని.. 9.05 గంటలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులను కూడా..

TG Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. హాల్ టికెట్ చూపిస్తే RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం!
Telangana Inter Exams

Updated on: Feb 25, 2026 | 7:34 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు 2026 బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు మొదలవుతాయి. విద్యార్ధులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. 5 నిమిషాలు గ్రేస్‌ టైం ఉంటుందని.. 9.05 గంటలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. హాల్‌టికెట్‌ ఉంటేనే అనుమతిస్తామని, లేదంటే అస్సలు అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది. బుధవారం జరిగే సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష కు సెట్- B ప్రశ్నాపత్రం ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది.

ఇక విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లను కూడా పరీక్షకు అనుమతిస్తామని తెలిపింది. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినా ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేసింది. హాల్‌టికెట్‌ వెంట ఉంటే సరిపోతుందని, ఇతర ఎలాంటి గుర్తింపు పత్రాలు అవసరంలేదని పేర్కొంది. ఈ రోజు నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు, గురువారం నుంచి సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.97లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 18వ తేదీ వరకు ఆయా తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 040-24655027, 9240205555 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే టెలి-మానస్‌కు నేరుగా ఫోన్‌ చేయవచ్చని, 24 గంటలూ టోల్‌ఫ్రీ నంబరు 14416 అందుబాటులో ఉంటుందని వివరించారు.

ఆర్టీసీ స్పెషల్‌ సేవలు

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్‌, పదోతరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపట్టింది. బస్సు స్టాప్‌ ఉన్నా.. లేకున్నా.. విద్యార్ధులు ఎక్కడ బస్సు ఆపినా బస్సులు ఆగేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బస్సు ఆపరేషన్స్‌పై సచివాలయంలో జరిపిన సమీక్షలో ఈ మేరకు మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. హాల్‌ టికెట్‌, కన్సెషన్‌ పాస్‌ ద్వారా పురుష విద్యార్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కండక్టర్‌, డ్రైవర్లను ఆదేశించారు. ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు సహా అన్ని పరీక్ష రోజులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. పాస్‌ లేని బాలురు సాధారణ ధరకే టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం కింద మహిళా విద్యార్థులకు జీరో-ఫేర్ టిక్కెట్లు జారీ చేయబడతాయి. పురుష విద్యార్ధులు COMBI టికెట్ (అదనపు రూ. 20 ఛార్జ్)తో ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

మూడు విడతల్లో మూల్యాంకనం

ఇంటర్ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనం షెడ్యూల్‌ను కూడా ఇంటర్‌బోర్డు ప్రకటించింది. మార్చి 4 నుంచి సంస్కృతం పేపర్లతో మూల్యాంకనం ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు తెలిపింది. మొత్తం మూడు విడతల్లో మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. మార్చి 15 నుంచి మొదటి విడత, మార్చి 18 నుంచి రెండో విడత, మార్చి 20 నుంచి మూడో విడత మూల్యాంకనం మొదలవుతాయని పేర్కొంది. ఏప్రిల్‌ రెండో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us