NEET UG 2026 Exam: ప్రశాంతంగా ప్రారంభమైన నీట్‌ యూజీ పరీక్ష.. ఒకే షిఫ్టులో 23 లక్షల మంది విద్యార్ధులకు ఎగ్జాం

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ యూజీ 2026) ఆదివారం (మే 3) మధ్యాహ్నం 2 గంటలకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో (పెన్‌ - పేపర్‌ విధానం) ద్వారా ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు..

NEET UG 2026 Exam: ప్రశాంతంగా ప్రారంభమైన నీట్‌ యూజీ పరీక్ష.. ఒకే షిఫ్టులో 23 లక్షల మంది విద్యార్ధులకు ఎగ్జాం
NEET UG Exam

Updated on: May 03, 2026 | 2:47 PM

హైదరాబాద్‌, మే 3: నీట్ పరీక్షకు తెలంగాణ రాష్ట్రంలో 73 వేల మందికిపైగా విద్యార్థుల కోసం మొత్ంత 150కిపైగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో 45 వేల మంది విద్యార్ధుల కోసం 180 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తున్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షకు 21 లక్షల మంది హాజరయ్యారు. ఈసారి 22.80 లక్షల మంది ఈ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర కోఆర్డినేటర్లు, సిటీ కోఆర్డినేటర్లు, పరిశీలకులు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, తనిఖీ సిబ్బంది, సహాయకులు, పోలీసు బందోబస్తు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈసారి ప్రతి గదిలో గోడ గడియారం, అభ్యర్థులను అప్రమత్తం చేసేలా అలారమ్‌ వ్యవస్థ కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా కాపీలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. మధ్యాహ్నం 1.30 గంటలకే అన్ని పరీక్ష కేంద్రాల్లో గేట్లు మూసేశారు. మధ్యాహ్నం 1.40 గంట వరకు అడ్మిట్‌ కార్డు, గుర్తింపు కార్డు పరిశీలన పూర్తి చేశారు. సరిగ్గా 2 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. అయితే పరీక్ష రాసే మూడు గంటల సమయంలో బయోమెట్రిక్‌ కోసం అభ్యర్థులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఇప్పటికే ఎన్టీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్‌ సమయంలో ఒకవేళ సర్వర్‌ మొరాయించినా, బయోమెట్రిక్‌ ప్రక్రియ పూర్తికాకపోయినా అభ్యర్ధులను పరీక్ష గదిలోకి అనుమతించాలని ముందే అన్ని పరీక్ష కేంద్రాలకు సూచనలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us