
అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల రూపకల్పన, ప్రశ్నల శైలి, మూల్యాంకన విధానంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు పదో తరగతి పరీక్షల్లో అమలులో ఉన్న బ్లూమ్స్ టాక్సానమీ (Bloom’s Taxonomy) స్థానంలో, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) పరిధిలోని ‘పరఖ్’ (PARAKH) వర్గీకరణ విధానాన్ని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రవేశపెడుతోంది. ఈ మేరకు కొత్త బ్లూప్రింట్లను విడుదల చేసిన బోర్డు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కొత్త విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించింది.
కొత్త విధానంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల్లోని విషయాలను కంఠస్థం చేసి రాయడం కాకుండా, వాటిని అర్థం చేసుకుని స్వతంత్రంగా ఆలోచించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ప్రశ్నలు రూపొందించనున్నారు. ఇప్పటి వరకు ప్రశ్నలను విజ్ఞానం, అవగాహన, అన్వయం, సృజనాత్మకత, మూల్యాంకనం వంటి విభాగాల ఆధారంగా వర్గీకరించేవారు. ఇకపై అవగాహన (Understanding), సున్నితత్వం (Sensitivity), సృజనాత్మకత (Creativity) అనే మూడు ప్రధాన విభాగాల ఆధారంగా ప్రశ్నలు రూపొందించనున్నారు.
అవగాహన విభాగంలో విద్యార్థి పాఠ్యాంశంపై ఉన్న అవగాహన, కాన్సెప్టుల అర్థం, వాటి అన్వయంపై ప్రశ్నలు ఉంటాయి. సున్నితత్వం విభాగంలో భిన్నాభిప్రాయాలను గౌరవించడం, సామాజిక అంశాలపై అవగాహన, సానుకూల దృక్పథం, టీమ్‌వర్క్ వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సృజనాత్మకత విభాగంలో కొత్త ఆలోచనలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు సూచించడం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్టులో మాత్రం అవగాహనకు 65 శాతం, సున్నితత్వానికి 15 శాతం వెయిటేజీ కేటాయించారు. విద్యార్థి ఆలోచనలకు ప్రాధాన్యం. సున్నితత్వం, సృజనాత్మకత విభాగాల్లో ఎక్కువగా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు ఉండనున్నాయి. అంటే ఒక ప్రశ్నకు ఒకే సమాధానం కాకుండా, విద్యార్థి తన అవగాహన, ఆలోచనల ఆధారంగా వివిధ రకాలుగా సమాధానం రాయవచ్చు. దీంతో విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, విశ్లేషణా శక్తి, అభిప్రాయ వ్యక్తీకరణ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నల క్లిష్టత కూడా మారుతుంది
ఈ విధానం ద్వారా అన్ని స్థాయిల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థుల సామర్థ్యాన్ని కూడా పరీక్షించనున్నారు.
సోషల్ స్టడీస్, బయాలజీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లో కొత్త తరహా ప్రశ్నలు ఇవ్వనున్నట్లు బ్లూప్రింట్‌లో స్పష్టమైంది. సోషల్ స్టడీస్‌లో లింగ సమానత్వం, సుస్థిరాభివృద్ధి వంటి సామాజిక అంశాలపై ప్రశ్నలు ఉండగా, బయాలజీలో ఆరోగ్య అవగాహన, జీవనశైలి ఎంపికలపై ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్‌లో ప్రసంగాల రచన, అధికారిక మరియు అనధికారిక లేఖల తయారీ, కమ్యూనికేషన్ నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థులు ఇకపై కేవలం పాఠ్యాంశాలను కంఠస్థం చేయడం సరిపోదు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించడం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. కొత్త పరీక్షా విధానం ద్వారా విద్యార్థులను మార్కుల కోసం చదివే విధానం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలోచించే, విశ్లేషించే, సృజనాత్మకంగా స్పందించే పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.