
AI కారణంగా పని విధానాలు వేగంగా మారుతున్నప్పటికీ, ఉద్యోగులను భవిష్యత్తుకు సిద్ధం చేసేవి కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదని IMA ఇండియా సౌత్ ఏషియా హెడ్ అరిందమ్ ఘోష్ అంటున్నారు. AI ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగులకు అత్యంత అవసరమైన నైపుణ్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
AIని ఉపయోగించడానికి ప్రతి ఒక్కరూ ప్రోగ్రామర్ కావాల్సిన అవసరం లేదు. అయితే AI ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎక్కడ ఉపయోగించాలి? దాని వల్ల ఎలాంటి తప్పులు జరిగే అవకాశం ఉంది? వంటి విషయాలపై అవగాహన ఉంటే సరిపోతుంది. AI టూల్స్‌ను ఉపయోగించడం ద్వారా పని వేగం, ఉత్పాదకత పెంచుకోవచ్చు. అయితే AI ఇచ్చిన సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా దాని కచ్చితత్వాన్ని పరిశీలించడం కూడా చాలా ముఖ్యం. భవిష్యత్తులో ప్రాథమిక వర్క్‌ప్లేస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం ఎంత ముఖ్యమో, ఉద్యోగార్ధులకు AI Literacy కూడా అంతే కీలకంగా మారనుంది.
AI క్షణాల్లో భారీ మొత్తంలో సమాచారాన్ని విశ్లేషించగలదు. కానీ ఆ సమాచారం వెనుక ఉన్న అసలు అర్థాన్ని గుర్తించడం మాత్రం మనుషుల బాధ్యతే. ప్రపంచ ఆర్థిక ఫోరం Future of Jobs Report 2025 ప్రకారం.. కంపెనీలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కోర్ స్కిల్స్‌లో అనలిటికల్ థింకింగ్ ముందంజలో ఉంది. 10 కంపెనీల్లో దాదాపు 7 కంపెనీలు దీనిని అత్యవసర నైపుణ్యంగా పరిగణిస్తున్నాయి. సరైన ప్రశ్నలు అడగడం, ముందస్తు అంచనాలను సవాలు చేయడం, సమాచారంలో ఉపయోగకరమైన అంశాలను గుర్తించడం, అవసరం లేని సమాచారాన్ని పక్కన పెట్టడం వంటి సామర్థ్యాలు ఉద్యోగులకు ఎంతో అవసరం. AI సమాధానం ఇవ్వగలదు.. కానీ ఆ సమాధానం సరైనదేనా కాదా? అని నిర్ణయించాల్సింది మాత్రం మనుషులే.
కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఉద్యోగులు తమ పని మొత్తం సంస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలి. ఫైనాన్స్, ఆపరేషన్స్, HR, మార్కెటింగ్, IT వంటి విభాగాల్లో పనిచేసే వారికి వ్యూహరచన, ప్రణాళిక, అంచనాలు, రిస్క్ మేనేజ్‌మెంట్, అవకాశాలను గుర్తించడం, టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై అవగాహన అవసరం. అంటే ఒక మార్కెటింగ్ ఉద్యోగి తాను నిర్వహించే అడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీ ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. అలాగే HR ఉద్యోగి కొత్త నియామకాలు సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అంచనా వేయగలగాలి.
సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయడంలో AI ముందుంటుంది. కానీ అసలు సమస్య ఏమిటో గుర్తించడం, దానికి సరైన పరిష్కారం ఎంచుకోవడం వంటి విషయాల్లో మానవ ఆలోచనకు ప్రాధాన్యం ఉంటుంది. కంపెనీ మరింత పెట్టుబడి పెట్టాలా? ఒక రిస్క్ తీసుకోవడం ప్రయోజనకరమా? కొత్త వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి స్ట్రాటజిక్ థింకింగ్, ప్రాబ్లెం సాల్వింగ్ నైపుణ్యాలు అవసరం. డేటాను విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవడం, వ్యాపారంపై దాని ప్రభావాన్ని గుర్తించడం, ఆ సమాచారాన్ని నిర్ణయాలుగా మార్చడం భవిష్యత్ ఉద్యోగాల్లో కీలకంగా మారనుంది.
AI సులభంగా భర్తీ చేయలేని నైపుణ్యాల్లో కమ్యూనికేషన్, టీమ్ వర్క్, క్రియేటివిటీ, అడాప్టబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమైనవి. AI క్షణాల్లో ఒక ప్రజెంటేషన్ తయారు చేయగలిగినప్పుడు.. దాన్ని సహచరులకు స్పష్టంగా వివరించడం, వారిని ఒప్పించడం, వివిధ టీమ్‌లతో సమర్థంగా పనిచేయడం వంటి మానవ నైపుణ్యాలు మరింత విలువైనవిగా మారతాయి. అలాగే టెక్నాలజీ నిరంతరం మారుతున్నందున కొత్త సాఫ్ట్‌వేర్, కొత్త AI టూల్స్‌ను త్వరగా నేర్చుకునే Adaptability కూడా ఉద్యోగులకు ఎంతో అవసరం.
భవిష్యత్ ఉద్యోగ రంగంలో పోటీ కేవలం మనుషులు వర్సెస్ AIగా ఉండకపోవచ్చు. AIతో సమర్థంగా పనిచేయగల ఉద్యోగులు, AIని ఉపయోగించలేని ఉద్యోగుల మధ్య పోటీగా మారే అవకాశం ఉంది. AI సమాచారాన్ని అందించగలదు. కానీ ఆ సమాచారాన్ని సరైన నిర్ణయంగా మార్చేందుకు టెక్నాలజీపై అవగాహనతో పాటు విశ్లేషణాత్మక ఆలోచన, వ్యాపార పరిజ్ఞానం, వ్యూహాత్మక ప్రణాళిక.. వంటి వాటికి మానవ నిర్ణయ సామర్థ్యం అవసరం తప్పనిసరి. అందుకే భవిష్యత్‌లో ఉద్యోగ భద్రత, కెరీర్ వృద్ధి కోరుకునే వారు కేవలం AI టూల్స్ నేర్చుకోవడం మాత్రమే కాకుండా.. AIతో కలిసి పనిచేయడం, దాని ఫలితాలను విశ్లేషించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలి.