కరెంట్ బిల్ షాక్ కొడుతోందా..? ఈ సింపుల్ టిప్స్‌తో మస్త్ పైసలు సేవ్..

రోజువారీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో చిన్న మార్పులు పెద్ద పొదుపుకు దారితీస్తాయని చాలామందికి తెలియదు. ప్రస్తుతం భారీగా వస్తున్న కరెంట్ బిల్లులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారు ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. అది ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కరెంట్ బిల్ షాక్ కొడుతోందా..? ఈ సింపుల్ టిప్స్‌తో మస్త్ పైసలు సేవ్..
Electricity Bill Tips

Updated on: Aug 15, 2025 | 12:02 PM

గత కొంతకాలంగా పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో ప్రజలు జేబులకు చిల్లులు పడుతున్నాయి. కరెంట్ బిల్స్ వెయ్యి దాటడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరెంట్ బిల్లు ఎక్కువ రాకుండా చేయవచ్చు. రోజువారీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో కొన్ని సాధారణ మార్పులు చేసుకోవడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి నెలా 100 యూనిట్లకు పైగా కరెంట్ వినియోగాన్ని తగ్గించగలిగే కొన్ని చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఫ్యాన్ రీప్లేస్‌మెంట్‌తో 30శాతం ఆదా

సాధారణంగా ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్‌లు రోజుకు సుమారు 20 గంటల పాటు నడుస్తాయి. సాంప్రదాయ 80 వాట్స్ ఫ్యాన్‌లు నెలకు 48 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి. కానీ ఆధునిక ఫ్యాన్‌లు అదే సమయం కోసం కేవలం 19 యూనిట్లను మాత్రమే ఉపయోగిస్తాయి. ఒక ఇంట్లో మూడు సాధారణ ఫ్యాన్‌లను BLDC మోడళ్లతో భర్తీ చేస్తే, నెలకు సుమారు 87 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. BLDC ఫ్యాన్‌ల ప్రారంభ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరు నుంచి ఎనిమిది నెలల్లో విద్యుత్ పొదుపు ద్వారా ఆ పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.

ట్యూబ్ లైట్ల నుండి వాటర్ మోటార్ల వరకు

లైట్లు: చాలా ఇళ్లలో ఇప్పటికీ మాగ్నెటిక్ చోక్‌లతో కూడిన పాత 40వాట్స్ ట్యూబ్ లైట్లు ఉన్నాయి. వాటిని 18 వాట్స్ LED ట్యూబ్‌లైట్లతో భర్తీ చేస్తే.. ఒక్కో లైట్‌కు 22 వాట్స్ వినియోగం తగ్గుతుంది. రోజుకు 10 గంటలు పనిచేసే నాలుగు ట్యూబ్ లైట్లు ఉన్న ఇంట్లో ఈ మార్పు ద్వారా నెలకు దాదాపు 26 యూనిట్లు ఆదా అవుతాయి.

వాటర్ మోటార్లు:
వాటర్ మోటార్లు, సరిగా నిర్వహించకపోతే అధిక విద్యుత్‌ను వినియోగిస్తాయి. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, బేరింగ్‌లకు గ్రీజింగ్ చేయడం వంటి సాధారణ నిర్వహణ పనులు సామర్థ్యాన్ని పెంచుతాయి. తద్వారా నెలకు 10 యూనిట్లు ఆదా చేయవచ్చు. లీకేజీలు లేని ప్లంబింగ్‌ను నిర్ధారించడం వల్ల మోటారు రన్‌టైమ్ తగ్గి, వినియోగం మరింత తగ్గుతుంది.

ఏసీ నిర్వహణ – స్టెబిలైజర్ల పట్ల జాగ్రత్తలు

ఎయిర్ కండిషనర్ :
డస్ట్ పేరుకుపోయిన ఏసీ కాయిల్స్ వల్ల విద్యుత్ వినియోగం 15శాతం వరకు పెరుగుతుంది. ప్రతి 15 రోజులకు కాయిల్స్‌ను శుభ్రపరచడం వల్ల వాటి సామర్థ్యం మెరుగవుతుంది. అలాగే ఉష్ణోగ్రతను 24°C వద్ద సెట్ చేయడం ద్వారా అదనపు పొదుపు లభిస్తుంది. 24°C కంటే తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేస్తే, ప్రతి డిగ్రీకి 3-5% వినియోగం పెరుగుతుంది.

వోల్టేజ్ స్టెబిలైజర్లు:
ఆధునిక ఫ్రిజ్‌లు, టీవీలకు ఇన్‌బిలిటీ వోల్టేజ్ నియంత్రణ ఉంటుంది. దీంతో స్టెబిలైజర్లు అనవసరం. అయితే చాలామంది వీటిని ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ పరికరాలు ఉపయోగంలో లేనప్పుడు కూడా విద్యుత్‌ను వినియోగిస్తూ, నెలవారీ బిల్లుకు 30-45 యూనిట్లను ఎక్కువగా తీసుకొస్తాయి.

ఈ చిన్న మార్పులను పాటించడం ద్వారా ఒక కుటుంబం నెలకు 150 యూనిట్లకు పైగా ఆదా చేయగలదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల వార్షికంగా రూ.1,500 లేదా అంతకంటే ఎక్కువ ఆదా అవుతుంది. విద్యుత్ బోర్డు అధికారులు కూడా ప్రజలు తమ ఉపకరణాల వినియోగాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని, చిన్నపాటి సర్దుబాట్లతో బిల్లు షాక్‌లను నివారించవచ్చని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..