రూపాయి కట్టే పనిలేదు.. జీరో ట్యాక్స్ ఉండే ఆదాయ మార్గాలు ఇవే..!

సాధారణంగా ఆదాయం సంపాదించే ప్రతి ఒక్కరికీ ఆదాయపు పన్ను విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిర్దిష్ట రకాల ఆదాయాలకు పూర్తిగా లేదా కొంతమేర పన్ను మినహాయింపు లభిస్తుందని స్పస్టం చేస్తున్నారు. సదరు విషయాలపై అవగాహన ఉంటే చట్టబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. పన్ను మినహాయింపు పొందే పలు ఆదాయ వనరుల గురించి మీకోసం ప్రత్యేకంగా..

రూపాయి కట్టే పనిలేదు.. జీరో ట్యాక్స్ ఉండే ఆదాయ మార్గాలు ఇవే..!
Zero Income Tax

Updated on: Nov 24, 2026 | 7:19 PM

సాధారణంగా ఆదాయం సంపాదించే ప్రతి ఒక్కరికీ ఆదాయపు పన్ను విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఎందుకుంటే ఎంత ఆదాయం వస్తే పన్ను చెల్లించాలి? ఏ ఆదాయాలపై మినహాయింపు ఉంటుంది? పన్ను భారం తగ్గించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతి ఆదాయంపైనా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిలునులు సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిర్దిష్ట రకాల ఆదాయాలకు పూర్తిగా లేదా కొంతమేర పన్ను మినహాయింపు లభిస్తుందని స్పస్టం చేస్తున్నారు. సదరు విషయాలపై అవగాహన ఉంటే చట్టబద్ధంగా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు.

పన్ను మినహాయింపులపై జాగ్రత్తలు..

అయితే ఆదాయాలన్నింటికీ ఒకే విధంగా పూర్తి పన్ను మినహాయింపు ఉండదని ముఖ్యంగా తెలుసుకోవాలి. కొన్నింటికి ఆదాయ పరిమితులు, మరికొన్నింటికి ఉద్యోగ కాలం, పాలసీ నిబంధనలు, పన్ను విధానం వంటి షరతులు వర్తిస్తాయి. అందువల్ల పన్ను ఆదా చేయాలనుకునే వారు తమ ఆదాయ వనరులు, పెట్టుబడులు, ఎంచుకున్న పన్ను విధానం ఆధారంగా ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. పన్ను మినహాయింపు పొందే ఆదాయాలను కూడా అవసరమైన సందర్భాల్లో ఐటీఆర్‌లోని సంబంధిత మినహాయింపు ఆదాయాల విభాగంలో వెల్లడించాలి. ఇలా సరైన వివరాలు సమర్పించడం వల్ల భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే సందేహాలు, నోటీసులను నివారించేందుకు సహాయపడుతుంది. పన్ను మినహాయింపు పొందే పలు ఆదాయ వనరుల గురించి మీకోసం ప్రత్యేకంగా..

పన్ను మినహాయింపు పొందే ఆదాయాలు ఇవే..

1. వ్యవసాయ ఆదాయం

భారత్‌లోని వ్యవసాయ భూమి నుంచి వచ్చే ఆదాయానికి సాధారణంగా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. పంటల సాగు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం వంటి చట్టంలో పేర్కొన్న కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఈ పరిధిలోకి వస్తుంది. అయితే వ్యవసాయ ఆదాయం రూ.5 వేలకు మించి, ఇతర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం కూడా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో పన్ను రేటు నిర్ణయించేందుకు వ్యవసాయ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

2. బంధువుల నుంచి వచ్చే బహుమతులు

తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, సోదరులు, సోదరీమణులు వంటి ఆదాయపు పన్ను చట్టం గుర్తించిన బంధువుల నుంచి అందే బహుమతులకు సాధారణంగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ విషయంలో నిర్దిష్ట ఆర్థిక పరిమితి ఉండదు. అయితే బంధువుల నిర్వచనం చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

3. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

చదువుకోవడానికి లేదా విద్యా ఖర్చుల కోసం అందే స్కాలర్‌షిప్‌లకు పన్ను మినహాయింపు ఉంటుంది. విద్యార్థులకు లభించే ఈ ఆర్థిక సహాయం ఆదాయపు పన్ను చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పన్ను పరిధిలోకి రాదు.

4. గ్రాట్యుటీ

ఒక సంస్థలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో లేదా ఉద్యోగం ముగిసినప్పుడు యాజమాన్యం గ్రాట్యుటీ చెల్లిస్తుంది. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేర్వేరు పరిమితులు, నిబంధనలు ఉంటాయి. అర్హత కలిగిన మేరకు గ్రాట్యుటీ మొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

5. ఈపీఎఫ్, పీపీఎఫ్ విత్‌డ్రాయల్స్

ఉద్యోగుల భవిష్య నిధి (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) నుంచి తీసుకునే మొత్తాలకు కొన్ని షరతుల మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా ఈపీఎఫ్‌లో సాధారణంగా ఐదేళ్ల నిరంతర సేవ పూర్తయిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తానికి పన్ను మినహాయింపు లభించవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలు మారుతాయి.

6. జీవిత బీమా ప్రయోజనాలు

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా వచ్చే మెచ్యూరిటీ మొత్తం, మరణ ప్రయోజనాలకు నిర్దిష్ట షరతుల మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా పాలసీ తీసుకున్న తేదీ, చెల్లించిన ప్రీమియం, సమ్ అష్యూర్డ్ వంటి అంశాల ఆధారంగా మినహాయింపు వర్తిస్తుంది. కాబట్టి అన్ని బీమా పాలసీలకు ఒకే విధమైన పన్ను నిబంధనలు ఉంటాయని భావించకూడదు.

7. హెచ్‌యూఎఫ్ నుంచి వచ్చే ఆదాయం

హిందూ అవిభక్త కుటుంబం (HUF) నుంచి సభ్యులకు వచ్చే నిర్దిష్ట ఆదాయాలకు పన్ను మినహాయింపు ఉండవచ్చు. అయితే ఆ మొత్తం కుటుంబ ఆదాయం నుంచి ఎలా పంపిణీ అయింది, దాని స్వభావం ఏమిటి అనే అంశాల ఆధారంగా పన్ను నిబంధనలు వర్తిస్తాయి.

8. కమ్యూటెడ్ పెన్షన్

ఉద్యోగ విరమణ సమయంలో ఉద్యోగులు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి తీసుకునే విధానాన్ని కమ్యూటెడ్ పెన్షన్ అంటారు. దీనికి పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులకు వర్తించే పరిమితులు వేర్వేరుగా ఉంటాయి.

9. టాక్స్ ఫ్రీ బాండ్ల వడ్డీ

ప్రభుత్వం లేదా నిర్దిష్ట సంస్థలు జారీ చేసే టాక్స్ ఫ్రీ బాండ్ల నుంచి వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే బాండ్‌పై వచ్చే వడ్డీ, దానిని విక్రయించడం ద్వారా వచ్చే మూలధన లాభాలు రెండింటినీ ఒకే విధంగా పరిగణించకూడదు.

10. ఉద్యోగులకు ఉపయోగపడే మరికొన్ని మినహాయింపులు

వేతన జీవులకు కూడా కొన్ని రకాల ఆదాయాలు, అలవెన్సులపై పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) వంటి వాటికి నిర్దిష్ట నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఇవి పాత పన్ను విధానంలోనే సాధారణంగా అందుబాటులో ఉంటాయి. కొత్త పన్ను విధానంలో వీటికి మినహాయింపు ఉండదు. అలాగే అర్హత కలిగిన ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (VRS) కింద వచ్చే పరిహారంపై నిర్దిష్ట పరిమితి వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. పార్ట్‌నర్‌షిప్ సంస్థలో భాగస్వామికి లాభాల్లో వాటాగా వచ్చే మొత్తానికి కూడా వ్యక్తిగత స్థాయిలో పన్ను మినహాయింపు ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనలో అర్హత కలిగిన మెచ్యూరిటీ మొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగి మరణం తర్వాత కుటుంబానికి అందే కొన్ని పరిహారాలు, బీమా క్లెయిమ్‌లకు కూడా నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us