
కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌దారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. నవంబర్ 30వ తేదీలోపు తప్పనిసరిగా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువులోగా పత్రాన్ని సమర్పించడంలో విఫలమైతే పెన్షన్ చెల్లింపులు నిలిచిపోతాయని స్పష్టం చేేసింది. పెన్షన్ పొందే వ్యక్తి జీవించే ఉన్నారని ప్రభుత్వాలు నిర్ధారణ చేసుకోవడానికి ఈ పత్రం ఉపయోగపడుతుంది. దీంతో ప్రతీ ఏడాది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరిగా చెప్పవచ్చు. 80 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్నవారికి ఈ డాక్యుమెంట్ సమర్పించేందుకు నవంబర్ 1 నుంచి 30 వరకు గడువు ఇచ్చారు. 80 ఏళ్లు పైబడినవారికి అక్టోబర్ 1వ తేదీ నుంచే అవకాశం కల్పిస్తుండగా.. వీరికి కూడా నవంబర్ 30తో గడువు ముగియనుంది.
జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించడానికి ఇంటి నుంచే తమ మొబైల్ ద్వారా పెన్షన్లు తీసుకునేవారు సమర్పించే అవకాశముంది. పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్‌లోని జీవన్ ప్రమాణ్ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా సులువుగా సమర్పించవచ్చు. అలాగే కామన్ సర్వీస్ సెంటర్లు, ప్రభుత్వ కేంద్రాలు, ఎంపిక చేసిన బ్యాంకులు, పోస్టాఫీస్ ద్వారా కూడా ఈ పత్రాన్ని సబ్మిట్ చేయవచ్చు. పోస్టల్ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కొత్త విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ అవకాశాలను ఉపయోగించుకుని గడువులోగా లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని కేంద్రం సూచించింది.
తమ నెలవారీ పెన్షన్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే నవంబర్ 30వ తేదీలోపు తమ వార్షిక జీవన్ ప్రమాణ్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని కేంద్రం తెలిపింది. ఈ గడువును పెన్షనర్లు తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ లైఫ్ సర్టిఫికెట్ చాలా కీలకమని, దీని ఆధారంగానే పెన్షన్ నిధులను విడుదల ఉంటుందని స్పష్టం చేసింది. చివరి నిమిషంలో తొందరపాటును నివారించేందుకు ముందుగానే జాగ్రత్త పడాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పోస్టాఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. పోస్టల్ సిబ్బందిని ఆశ్రయిస్తే.. వారు పెన్షనర్ ఇంటి వద్దకే వచ్చి అవసరమైన పత్రాలను సేకరించి, లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ ప్రక్రియను పూర్తి చేస్తారు. పెన్షనర్లు తమ పెన్షన్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO), బ్యాంక్ పాస్ బుక్ వివరాలను అందించాల్సి ఉంటుంది.