
ఇప్పటి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. చేతిలో నగదు లేకపోయినా అత్యవసర ఖర్చులు, షాపింగ్, బిల్లుల చెల్లింపులు సులభంగా నిర్వహించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించకపోతే మాత్రం తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకులు సూచించే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఆప్షన్ తాత్కాలిక ఉపశమనంగా కనిపించినా, దీర్ఘకాలంలో సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
క్రెడిట్ కార్డ్ బిల్లు గడువు తేదీ దాటినా కనీస మినిమమ్ డ్యూ కూడా చెల్లించకపోతే, ఆ ఖాతా డిఫాల్ట్ కేటగిరీలోకి వెళుతుంది. మొదట్లో బ్యాంకులు రిమైండర్లు పంపినా, 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు బకాయి కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఈ దశలో బ్యాంకులు నిరంతరం కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్ ద్వారా రికవరీ ప్రయత్నాలు చేస్తాయి. 90 రోజులకు మించి బకాయి ఉంటే ఆ ఖాతాను NPA (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్)గా పరిగణించే అవకాశం ఉంటుంది.
చాలా సందర్భాల్లో ఆరు నెలలకు పైగా చెల్లింపులు జరగకపోతే, బ్యాంకులు వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఆఫర్ చేస్తాయి. అంటే మొత్తం బకాయిలో కొంత మొత్తాన్ని మాత్రమే తీసుకుని ఖాతాను ముగిస్తాయి. అప్పటి పరిస్థితుల్లో ఇది కస్టమర్‌కు ఉపశమనంగా అనిపించినా, క్రెడిట్ రిపోర్ట్‌లో క్లోజ్డ్‌కు బదులు సెటిల్డ్ అని నమోదు అవుతుంది. ఈ ఒక్క పదమే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. సిబిల్, ఎక్స్‌పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలు ఈ వివరాలను నమోదు చేస్తాయి. దీంతో సిబిల్ స్కోర్ భారీగా పడిపోతుంది. ముఖ్యంగా ఈ రికార్డు దాదాపు ఏడు సంవత్సరాలపాటు క్రెడిట్ హిస్టరీలో కొనసాగుతుంది.
తర్వాత గృహ రుణం, వాహన రుణం లేదా వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు ఆ సెటిల్డ్ రికార్డును చూసి అప్రమత్తం అవుతాయి. కొన్నిసార్లు రుణాన్ని పూర్తిగా తిరస్కరించవచ్చు. ఒకవేళ రుణం మంజూరు చేసినా, అధిక వడ్డీ రేట్లు లేదా తక్కువ క్రెడిట్ లిమిట్ విధించే అవకాశం ఉంటుంది. ఇంకా మరో ప్రమాదం భారీ వడ్డీలు. క్రెడిట్ కార్డు బకాయిలపై బ్యాంకులు వార్షికంగా 36 శాతం నుంచి 40 శాతం వరకు వడ్డీ విధించే అవకాశముంది. లేట్ ఫీజులు కూడా జతకావడంతో చిన్న అప్పు కొద్ది నెలల్లోనే భారీ భారం అవుతుంది. అందుకే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బిల్లులు పూర్తిగా ఎగ్గొట్టకుండా, ముందుగానే బ్యాంకుతో మాట్లాడి EMI లేదా రీస్ట్రక్చరింగ్ వంటి మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సిబిల్ స్కోర్ కూడా రక్షితంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి