అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ సంచలన నిర్ణయం

జూన్ 16వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 16, 17 తేదీలలో కేవలం రెండు రోజుల పాటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే...

అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ సంచలన నిర్ణయం
Follow us

|

Updated on: Jun 15, 2020 | 3:11 PM

జూన్ 16వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 16, 17 తేదీలలో కేవలం రెండు రోజుల పాటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే, రాష్ట్రంలో నెలకొన్న లాక్ డౌన్, కరోనా విజృంభణలకు రాజకీయ ప్రకంపనలు కూడా జత కావడంతో అసెంబ్లీ సమావేశాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ తరుణంలో చంద్రబాబు నేత‌ృత్వంలో సోమవారం సమావేశమైన టీడీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది.

రెండ్రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని భావిస్తున్నట్లుగా కథనాలు వచ్చాయి. అయితే సోమవారం సమావేశమైన తెలుగుదేశం పార్టీ నేతలు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అక్రమ అరెస్టులు, ఇసుక మాఫియా, మద్యం ధరలు, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. తమ పార్టీ నేతల అరెస్టులపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు టీడీపీ నేతలు. మరోవైపు జూన్ 16వ తేదీన ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలుత గవర్నర్ ప్రసంగం వుంటుంది. ఆ తర్వాత వెనువెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి… మధ్యాహ్నం సెషన్‌లో వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. ఆ వెంటనే బడ్జెట్‌పై స్వల్ప వ్యవధిలో చర్చను ముగించి.. సభ ఆమోదం తీసుకుంటారు. తిరిగి మంగళవారం సమావేశమయ్యే ఏపీ అసెంబ్లీ… కొన్ని కీలక బిల్లులను ఆమోదించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడుతుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.

తాజాగా రెండ్రోజుల సభలో పలు కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష టీడీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సభలో కార్యకలాపాలు అధికార పక్షం అనుకున్నంత వేగంగా, అదే షెడ్యూల్‌లో జరుగుతాయా అన్న సందేహాలు మొదలయ్యాయి. విపక్ష టీడీపీ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ కూడా ప్రతివ్యూహంతో రెడీ అవుతున్నట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి.