Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

మళ్ళీ మొదలైంది కోల్డ్ వార్..ఈసారి ఏమంటున్నారంటే?

karanam gottipati socialmedia war, మళ్ళీ మొదలైంది కోల్డ్ వార్..ఈసారి ఏమంటున్నారంటే?

ఒకే ఒరలో రెండు కత్తుల్లాంటి నేతల మధ్య మళ్లీ వార్‌ మొదలైందా? టీడీపీ నేతలు కరణం బలరామ్‌, గొట్టిపాటి రవి, సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారా? మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు చొరవతో గెలుపు కోసం ఒకరికొకరు పరోక్షంగా సాయం చేసుకున్న ఈ ఇద్దరూ ఇపుడు సోషల్‌మీడియాలో మాటల తూటాలు పేల్చుతున్నారా? అన్న సందేహాలు ప్రకాశం పాలిటిక్స్‌లో తాజాగా జోరందుకున్నాయి.

ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే – 2014 ఎన్నికల్లో అద్దంకిలో కరణం, గొట్టిపాటిల మధ్య పెద్ద రణమే నడిచింది. అయితే 2019 ఎన్నికల నాటికి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గొట్టిపాటి వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ చేశారు. తిరిగి అద్దంకి నుంచి పోటీ చేశారు. ఇక కరణం బలరామ్‌ ఈసారి చీరాల నుంచి పోటీచేయడంతో అద్దంకిలో ఆధిపత్యపోరుకు తెరపడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చొరవతో అద్దంకి, చీరాల సీట్లలో ఒకరి గెలుపు కోసం మరొకరు పరోక్షంగా సాయం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో ఒకే పార్టీలో ఉన్న ఈ నేతల మధ్య వార్‌ ముగిసినట్టేనని అందరూ భావించారు. అందుకు తగినట్టుగానే టీడీపీ సమావేశాలలో ఎదురుపడినప్పుడు పలకరింపులు లేకపోయినా చాలావరకూ సమన్వయంతోనే ఇద్దరు నేతలు వ్యవహరించారు.

అయితే తాజాగా మళ్లీ సోషల్‌మీడియాలో ఇద్దరి మధ్య వార్‌ మొదలైందని ప్రచారం జరగుతోంది. ఇటీవల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్‌ క్వారీలపై విజలెన్సు దాడులు చేయడం, ఆయనను వైసీపీలోకి తీసుకురావడానికే చేయిస్తున్నారన్న కామెంట్లు వినిపించాయి. దీంతో గొట్టిపాటి రవి వైసీపీలోకి వెళుతున్నారన్న ప్రచారం జరిగింది. అలాగే చీరాల ఎంఎల్‌ఏ కరణం బలరామ్‌ కూడా వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే దీన్ని ఆయన ఖండించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఇదే సందర్భంలో గొట్టిపాటి వైసీపీలో చేరుతున్నారన్న అంశంపై బలరామ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఓ సెటైర్‌ వచ్చింది. ” బెదిరిస్తే పార్టీ మారడానికి మాకు రాళ్ల వ్యాపారం లేదు. మాకు ఇసుక వ్యాపారం లేదు, అందుకే పార్టీలు మారాల్సినఅవసరం లేదు‘‘ అంటూ కరణం ఫోటోతో సహా ఓ సెటైరిక్‌ పోస్టు చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సెటైర్‌కి కౌంటర్‌గా సోషల్‌మీడియాలో గొట్టిపాటి పేరుతో మరో పోస్టింగ్ కనపడింది. “రాళ్ల వ్యాపారముంటే రాజీ పడాలా? 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న క్వారీలపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటా! టీడీపీని మాత్రం వీడను. జై తెలుగుదేశం!‘’ అంటూ కౌంటర్‌ ప్రచురితమైంది. ఈ రెండు పోస్టులూ కరణం, గొట్టిపాటిలకు చెందిన సోషల్‌ మీడియా అకౌంట్లనుంచే పబ్లిష్‌ అయ్యాయి. దీంతో ఈ రెండు పోస్టింగ్‌లూ వైరల్‌గా మారాయి.

కరణం, గొట్టిపాటి పోస్టింగ్‌లను చూసి సోషల్‌ మీడియా వేదికగా మళ్లీ ఇద్దరి మధ్య వార్‌ మొదలైందని చెప్పుకుంటున్నారు. ఈ పోస్టులు తాము పెట్టలేదని, తమ అభిమానులు పెట్టి ఉంటారని ఇద్దరు నేతలు అంటున్నారట. గతంలో తమ మధ్య వైరం ఉన్నమాట నిజమే కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని ఇద్దరు స్పష్టం చేస్తున్నారట. మరోవైపున సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. దీనికి కూడా ఫుల్‌స్టాప్‌ పడితేనే ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నట్టని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట.